సి.ఎం.ఎస్-ఇండియన్ కరెప్షన్ స్టడీ సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన 2017 సర్వే నివేదికలో 2005 సంవత్సరం నివేదికతో పోలిస్తే 2017లో దేశంలో లంచాలు ఇవ్వడం, తీసుకోవడం చాలా తగ్గిందని పేర్కొంది. 2005లో జరిపిన సర్వేలో దేశ ప్రజలు సుమారు రూ.20,500 కోట్లు లంచాలుగా సమర్పించుకోగా, 2017లో రూ. 6,350 కోట్లు లంచాలుగా సమర్పించుకొన్నారని సర్వే నివేదికలో పేర్కొంది. అంటే 2005తో పోలిస్తే దేశంలో లంచాలు తీసుకోవడం తగ్గిందని పేర్కొంది.
కానీ వాస్తవ పరిస్థితి ఈ నివేదికకు పూర్తి భిన్నంగా ఉందని అందరికీ తెలుసు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలన చాలా పారదర్శకంగా, అవినీతి రహితంగా జరుగుతోందని ‘సెల్ఫ్ సర్టిఫై’ చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అంత మాత్రాన్న అవినీతి, లంచగొండితనం లేకుండాపోలేదని ఇటీవల వరుసగా పట్టుబడుతున్న అవినీతి అధికారులు, బారీగా కూడబెట్టుకొన్న వారి ఆస్తులు నిరూపించి చూపుతున్నాయి.
మన దేశంలో అభివృద్ధి లేదా సంక్షేమ పధకాల అమలుకు బలమైన యంత్రాంగం, విధివిధానాలు రూపొందించుకోలేకపోవచ్చేమో కానీ ఎక్కడిక్కడ లంచాలు పుచ్చుకోవడానికి చాలా పకడ్భందీ విధానం ఉన్న సంగతి భాధితులకు తెలుసు.
ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు ప్రభుత్వాసుపత్రిలో మార్చూరీలోని శవాన్ని బంధువులకు అప్పగించడానికి రూ.500 డిమాండ్ చేస్తే, విద్యుత్ కనెక్షన్ కోసం, ఇంటి ప్లాన్ ఆమోదం కోసం, స్థిరాస్తుల క్రయవిక్రయాలలో వేలల్లో లంచాలు తీసుకోవడం కామన్.
ఇక ప్రభుత్వాల స్థాయిలో జరిగే అవినీతిని లెక్కలు కట్టగలిగితే వేలు, లక్షల కోట్లు ఉంటుంది. దానిని లెక్కలు తీయడం అసాధ్యం కనుక చిన్న చేపలు, చిన్న చిన్న తిమింగలాలు మింగేసే దానినే లెక్కలు కట్టి ర్యాంకులు ప్రకటించేస్తుంటే, అధికార ప్రతిపక్షాలు దానినే ప్రామాణికంగా తీసుకొని గొప్పలు చెప్పుకోవడమో లేదా విమర్శించుకోవడమో చేస్తుంటాయి. ఒక పక్క అవినీతి, లంచగొండితనం నానాటికీ పెరుగుతూనే ఉంది. మరోపక్క అవినీతిపై సర్వేలు, ఇటువంటి ర్యాంకుల ప్రకటనలు, వాటిపై అధికార, ప్రతిపక్షాల హడావుడి అంతా రొటీన్ అయిపోయింది.