కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు?

April 27, 2017


img

“ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు?” అని మీడియా తీవ్రంగా చర్చించేస్తోంది. ఆయన మాట్లాడితే ఓయు విద్యార్దులు నిరసనలు తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినందునే మాట్లాడలేదని మీడియా నిర్ధారించేసింది. అదే మీడియా.. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నట్లు అనుమానం ఉన్న ఓయు విద్యార్ధులను పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేశారని, అలాగే సభలో పాల్గొన్న విద్యార్ధులను కూడా సభా వేదికకు చాలా దూరంగా కూర్చోనే విధంగా ఏర్పాట్లు చేశారని పేర్కొంది. కనుక సభలో కేసీఆర్ మాట్లాడకపోవడానికి మీడియా చెపుతున్న కారణం సరికాదని అర్ధం అవుతోంది. ఒకవేళ సభలో కేసీఆర్ మాట్లడదలచుకొంటే ఓయు విద్యార్ధులు అడ్డుకోగలరా?ఆపగలరా? అని ఆలోచిస్తే కాదనే అర్ధం అవుతుంది. 

ఒకవేళ కేసీఆర్ ఆ సభలో ప్రసంగించదలిస్తే, గవర్నర్ నరసింహన్, ఇంకా చాల మంది ప్రసంగించవలసి ఉంటుంది. వారు ప్రసంగిస్తున్న సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మద్యలో లేచి వెళ్ళిపోవడం మర్యాదగా ఉండదు. కానీ ఆయన పర్యటన షెడ్యూల్ ఆరు నెలల ముందే ఖరారు అయిపోయింది కనుక దాని ప్రకారం సాగేందుకు ఆయన తక్షణం డిల్లీ తిరిగి వెళ్ళడం కూడా అవసరమే. కనుకనే ఆయన ప్రసంగంతో సభను సరిపెట్టారని భావించవచ్చు.  

రాష్ట్రపతి వెళ్ళిపోయిన తరువాత కేసీఆర్ ప్రసంగించవచ్చు కదా? అనే సందేహం కలుగవచ్చు. కానీ ఈరోజు వరంగల్ లో తెరాస బహిరంగ సభ ఉంది. గత వారం పదిరోజులుగా దాని కోసం ఆయన తన మంత్రులు, పార్టీ నేతలు, అధికారులతో చర్చిస్తూ మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. ఆ కారణంగా క్షణం తీరికలేకుండా ఉన్నారు. బహుశః అందుకే కేసీఆర్ ఓయు వేడుకలలో ప్రసంగించకపోయుండవచ్చు. 

ఉద్యోగాల కల్పన విషయంలో ఓయు విద్యార్ధులలో అసంతృప్తి నెలకొని ఉందనే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియదనుకోలేము. ఆ అంశంపై ఇప్పటికే ఆయనతో సహా మంత్రులు, పార్టీ నేతలు చాలాసార్లు వివరణ ఇచ్చారు. బహుశః ఈరోజు సాయంత్రం వరంగల్ నగరంలో జరుగబోయే ప్రగతి నివేదన సభలో ఆ విషయం కేసీఆర్ తప్పకుండా ప్రస్తావించవచ్చు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ఏదైనా ప్రకటన చేయవచ్చు. మీడియాలో వస్తున్న ఈ వ్యాఖ్యలపై కూడా బహుశః కేసీఆర్ స్పందించవచ్చు. కనుక చిన్న చిన్న విషయాలపై కూడా ఏదో ఊహించుకోవడం కంటే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటనే విని నిర్ధారణ చేసుకొంటే మంచిది కదా? 


Related Post