బాహుబలిని అవి మరీ మోసేస్తున్నాయా?

April 27, 2017


img

రేపు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి రెండవ భాగం విడుదల కాబోతోంది. బాహుబలి మొదటి భాగంతో దర్శకుడు రాజమౌళి తన సత్తా ఏమిటో లోకానికి చాటి చూపారు. కనుక సహజంగానే రెండవ భాగంపై అందరిలో బారీ అంచనాలున్నాయి. కనుక దాని విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాట వాస్తవమే.

టీం-రాజమౌళి రెండవ భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచే పోస్టర్లు, టీజర్లు విడుదల చేస్తూ, ఎవరూ ఊహించని స్థాయిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడం ద్వారా, ఆ సినిమాలో నటీనటులు, రాజమౌళి టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక పద్ధతి ప్రకారం బాహుబలి-2కి మంచి హైప్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. నిజానికి రాజమౌళి బాహుబలిని సాంకేతికంగా ఎంత అద్భుతంగా తీశారో, తన సినిమాను అంతకంటే గొప్పగా ప్రమోట్ చేసుకోగలిగారని చెప్పవచ్చు. మరోవిధంగా చెప్పాలంటే బాహుబలి సినిమా ద్వారా ‘సినిమా ప్రమోషన్’ లోను ఆయన కొత్త ఒరవడి సృష్టించారని చెప్పవచ్చు. 

బాహుబలి విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని న్యూస్ ఛాన్నాళ్ళు బాహుబలిని తమ భుజాల మీద ఎత్తుకొని మోసేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలతో బాటు దేశ, విదేశాలలో ప్రజలు కూడా బాహుబలి-2ని చూసేందుకు పరితపించిపోతున్నారని, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తూన్నారని, టికెట్లు సంపాదించడం కోసం అందరూ పడరానిపాట్లు పడుతున్నారని, వారి ఆత్రం చూసి ఆన్-లైన్ లో నకిలీ టికెట్లను విక్రయించే సంస్థలు పుట్టుకొచ్చాయని ఇంకా బాహుబలి గొప్పదనం అది..ఇదీ..అని కధలుకధలుగా వర్ణించేస్తూ దానికి హైప్ పెంచడంలో మన టీవీ ఛానల్స్ శాయాశక్తుల కృషి చేస్తున్నాయి.

తెలుగు న్యూస్ ఛానల్స్ దానిని భుజానికి ఎత్తుకొని మోస్తున్న తీరు చూస్తుంటే, అవి కూడా ఆయన సినిమా ప్రమోషన్ లో భాగంగానే డబ్బు తీసుకొని డబ్బా కొడుతున్నయా లేక ఆ పేరు చెప్పుకొని తమ టి.ఆర్.పి రేటింగ్స్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే టీవీ ఛానళ్ళు చెపుతున్నట్లు ప్రజలకు మరేమి పనులు లేవా? అందరూ ఎప్పుడూ ఆ సినిమా గురించే ఆలోచిస్తుంటారా? విడుదలైన వెంటనే చూడకపోతే ప్రపంచం స్తంభించిపోతుందా? అంటే కాదని చెప్పవచ్చు. 

నిజమే..బాహుబలి సినిమా సాంకేతికంగా చాలా గొప్ప సినిమాయే. అది తెలుగు సినిమా స్థాయిని, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి చేర్చినమాట కూడా వాస్తవమే. కనుక బాహుబలి విజయం అందరికీ సంతోషమే. అయితే ఆ సినిమా కధాపరంగా చూస్తే, ఎన్టీఆర్, కాంతారావు, సత్యనారాయణ, కృష్ణ వంటి మహానటులు ఆ రోజుల్లోనే అటువంటి సినిమాలు ఒకటీ రెండూ కాదు.. కొన్ని డజన్లు తీసిపడేశారు. 

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ తదితర బాషలలోను అటువంటి కధాంశం ఉన్న సినిమాలు కోకొల్లలుగా వచ్చాయి. ఆ రోజుల్లో వాటిని కేవలం రెండు మూడు నెలల్లోనే తీసి విడుదల చేసేవారు. వాటిలో చాలా సినిమాలు వందరోజులు ఆడినవి ఉన్నాయి. కానీ ఒక మామూలు కధను చెప్పడానికి రాజమౌళికి రెండు భాగాలు..వాటిని తీయడానికి వందల కోట్లు అవసరం అయ్యాయి. వాటిని తీయడానికి ఒకటి రెండూ కాదు..దాదాపు ఐదేళ్ళ సమయం తీసుకొన్నారు. 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది సస్పెన్స్ అంటున్నారు. నిజమే. కానీ ఆ సినిమాలో వీరపోరాట యోధురాలుగా చూపించిన తమన్నాను ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే ఒక మామూలు హీరోయిన్ స్థాయికి దిగజార్చేసి, అందాల ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు రాజమౌళి? మొదట ఆమెను అంత గొప్పగా చూపించినప్పుడు ప్రభాస్ తో సమానంగా అమెకు యాక్షన్ సీన్స్ ఇచ్చి మహిళా శక్తిని ఎందుకు చాటి చెప్పలేదు? ప్రభాస్ పోరాడుతుంటే అంత గొప్ప యోధురాలు ఒక మామూలు హీరోయిన్ లాగ కళ్ళు విప్పార్చుకొని చూసే ప్రేక్షకపాత్రకే రాజమౌళి ఎందుకు పరిమితం చేశారు? వంటి ప్రశ్నలు అడిగితే బాగుండేది.    

మాయాబజార్ సినిమాలో పాటలు నేటికీ అందరికీ గుర్తున్నాయి. మరి బాహుబలి సినిమా పాటలు ఎవరికైనా గుర్తున్నాయా? నేటికీ టీవీలో మాయాబజార్ లేదా నర్తనశాల లేదా గుండమ్మ కధ వంటి సినిమాలు వస్తే ప్రజలూ పూర్తిగా చూస్తూనే ఉంటారు. కానీ బాహుబలిని చూస్తున్నారా? అంటే అనుమానమే.

ఏ గ్రాఫిక్స్ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే మాయాబజార్ సినిమాలో దుందుబులు మ్రోగుతుంటే  ఘటోత్కచుడు లీలగా కనిపిస్తూ మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యే సీన్ ఎవరైనా మరిచిపోగలరా? అడవిలో చెట్లు కాలకుండా మంటలు పరుచుకోవడం..మళ్ళీ వెనక్కి తగ్గిపోవడం వంటి గొప్ప ట్రిక్స్ ఎవరైనా మరిచిపోగలరా? అందుకే బాహుబలి సినిమాను అలనాటి మహానటి జమున ఒక మామూలు సినిమాగా తేల్చేశారని చెప్పవచ్చు. అయితే ఆ పాత జానపద సినిమాలకు ఇప్పటి బాహుబలికి తేడా ఏమిటంటే బారీ సెట్టింగ్స్..గ్రాఫిక్స్..సాంకేతిక అద్భుతం, మంచి ప్రమోషన్ చేయడం. అందుకే బాహుబలికి అంత క్రేజ్ వచ్చింది. 

ఏమైనప్పటికీ, బాహుబలి సినిమాకి మన తెలుగు న్యూస్ చానల్స్ కొడుతున్న డప్పు వలన ఆ సినిమా ఇప్పటికే సగం విజయం సాధించేసింది కనుక తెలుగువారి కీర్తి ప్రతిష్టలు దశదిశలా చాటే బాహుబలి విజయవంతం కావాలని అందరం కోరుకొందాము. 


Related Post