హైదరాబాద్ ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ తెరాస సర్కార్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ కేసును విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలుచేయమని కోరుతూ నోటీస్ జారీ చేసింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది, “ఇదివరకు తెలంగాణా సాధన కొరకు కేసీఆర్ స్వయంగా నగరంలోనే అనేక సభలు, సమావేశాలు, ఉద్యమాలు నిర్వహించారు. మిలియన్ మార్చ్ కూడా జరిగింది. అప్పుడు వాటిని గట్టిగా సమర్ధించుకొన్న కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే ప్రజలు, ప్రతిపక్షాలు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం లేకుండా ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించారు. అప్పుడు లేని ఇబ్బందులు, సమస్యలు, అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు? ఇది అప్రజాస్వామికం, ప్రజల ప్రాధమిక హక్కులను హరించివేసే ప్రయత్నమే,” అని వాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం. ధర్నాచౌక్ తరలింపుపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెరాస సర్కార్ నోటీస్ జారీ చేసి ఈ కేసును వాయిదా వేసింది.
ధర్నాచౌక్ ఎవరూ ధర్నాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుకొంటున్న సంగతి తెలిసిందే. కనుక ఒకవైపు అక్కడికి ఎవరినీ అనుమతించకుండా అడ్డుకొంటున్నప్పుడు, ధర్నా చౌక్ తరలింపుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని రామకృష్ణా రెడ్డి కోర్టుకు చెప్పి ఉంటే అది కోర్టును తప్పు దారి పట్టించడమే అవుతుంది కదా? ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. తనకు తెలంగాణా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని హైకోర్టు ఆగ్రహిస్తే ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఇంకా లోకువావుతుంది కదా? కనుక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం పునరాలోచించుకొంటే మంచిదేమో?