నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కటినమైన చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కోసం ఈ నెల 30న శాసనసభ, మండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసేందుకు తెరాస సర్కార్ జీవో 123 జారీ చేసినప్పటికీ, న్యాయవివాదాలు కొనసాగుతుండటంతో కేంద్రప్రభుత్వం సూచనల మేరకు 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో సూచించిన విధంగానే నిర్వాసితులకు నష్టపరిహారం, ప్యాకేజి ఇచ్చేవిధంగా భూసేకరణ చట్టానికి కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన జి.ఎస్.టి.బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి దానిని పార్లమెంటులో ఆమోదింపజేసుకొన్నందునే దానికి అన్ని అవరోధాలు తొలగి త్వరలోనే దేశవ్యాప్తంగా ఏకీకృతపన్ను విధానం అమలులోకి రాబోతోంది. అదేవిధంగా తెరాస సర్కార్ ఈ భూసేకరణ చట్టానికి ప్రతిపాదిస్తున్న సవరణలకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టగలిగితే, ఇకపై భూసేకరణలో ప్రతిపక్షాల నుంచి ఆటంకాలు తగ్గవచ్చు. అయితే మరో రెండేళ్ళలో ఎన్నికలు వస్తునందున తెరాస సర్కార్ కు మంచిపేరు తెచ్చిపెట్టే ఏ పనికీ ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది. కనుక తెరాస సర్కార్ అందుబాటులో ఉన్న మార్గాలను ఎంచుకొని ముందుకు సాగకతప్పదు.