అప్పుడు సింగరేణి..ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు

April 26, 2017


img

ఇదివరకు సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలకు వీలుకల్పిస్తూ తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు జారీ చేసిన జీవో :16 ను హైకోర్టు కొట్టి వేసింది. వారిని క్రమబద్దీకరిస్తే తమ వంటి  నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోతారని వాదిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు వారితో ఏకీభవిస్తూ తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 

తెలంగాణా ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తరచు ఈవిధంగా కొట్టివేస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది. దీని వలన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా దాని చేతులు కట్టివేసినట్లు అవుతోంది. 

దీని వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. రాజకీయ కోణం 2. జీవోల రూపొందించేటపుడు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం. 

 సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తెరాస సర్కార్ హడావుడిగా వారసత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని ప్రతిపక్షాల వాదన. కాంగ్రెస్ పార్టీకి చెందిన సతీష్ అనే వ్యక్తే వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుపడ్డాడని తెరాస వాదన. ఈ వ్యవహారంలో రాజకీయ కోణాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. 

ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను కూడా న్యాయస్థానాలు కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటికంటే ఈ మూడేళ్ళలో తెరాస సర్కార్ జారీ చేసిన జీవోలను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఎక్కువగా కొట్టివేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మొదటిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాసకు పాలనానుభవం లేకపోయినా దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలకు సేవలు అందిస్తున్న అధికారులకు ఉంటుంది. మరి వారి సూచనలను తెరాస సర్కార్ పట్టించుకోవడం లేదా లేక వారు ప్రభుత్వానికి తగిన మార్గదర్శకత్వం చేయడం లేదా? అనే సందేహం కలుగుతుంది. పైగా ప్రభుత్వం ఒక జీవోను రూపొందించేటప్పుడు న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకొంటుంది. మరి లోపం ఎక్కడ ఉన్నట్లు? 

ఇంతకు ముందు సింగరేణి కార్మికులు నష్టపోతే ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులు నష్టపోవలసి వస్తోంది. వారిని ఆదుకోవాలని తెరాస సర్కార్ చిత్తశుద్ధి, తపన ఉన్నప్పటికీ తరచూ ఈవిధంగా జరగుతుండటం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు రావడమే కాకుండా ఏదో ఒక వర్గానికి నష్టం జరుగుతుంటుంది. కనుక లోపం ఎక్కడ ఉందో తెలుసుకొని దానిని సరిదిద్దుకోవడం మంచిది.


Related Post