రాష్ట్రంలో తెదేపా-భాజపాలు దూరం అయ్యి చాలా కాలమే అయ్యింది కానీ ఇంకా అధికారికంగా కటీఫ్ చెప్పుకోలేదు. భాజపా ఆ విషయం నేరుగా చెప్పనప్పటికీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని, రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం తామేనని గట్టిగానే చెప్పుకొంటోంది. ఆ రెండు పార్టీలు ప్రస్తుతం ఏపిలో, కేంద్రంలో భాగస్వాములుగా, మిత్రపక్షాలుగా కొనసాగుతుండటం వలన తెలంగాణాలో ఆ రెండు పార్టీలు నేరుగా ఒకరినొకరు విమర్శించుకోలేక, అలాగని కలిసి పనిచేయలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.
రాష్ట్రంలో భాజపా నేతలు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ తెరాస సర్కార్ ను గట్టిగా డ్డీ కొంటున్నారు. ఈ పరిస్థితులలో తాము వారితో ఏవిధంగా వ్యవహరించాలని తెలంగాణా తెదేపా నేతలు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుని అడిగారు. దానికి ఆయన వద్ద కూడా సరైన సమాధానం లభించలేదని సమాచారం. తెలంగాణాలో తెదేపా-భాజపా పొత్తుల గురించి డిల్లీ పెద్దలను కలిసినప్పుడు మాట్లాడుతానని వారిని సమాధానపరిచి పంపించివేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణాలో తెదేపాకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ మొదటి నుంచి కూడా భాజపా నేతలు తెదేపాతో పొత్తులను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గ్రేటర్ ఓటమి తరువాత రాష్ట్రంలో భాజపా ఇంకా బలహీనంగా మారినప్పటికీ వారు తెదేపాకు ఇంకా దూరం జరిగారు తప్ప దానికి దగ్గరయ్యే ఆలోచన కూడా చేయలేదు. మొన్న యూపి, ఉత్తరాఖండ్ ఎన్నికలలో, మళ్ళీ ఇవ్వాళ్ళ డిల్లీ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించడంతో రాష్ట్ర భాజపా నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెలంగాణాలో కూడా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బలంగా నమ్ముతున్నారు. కనుక వారు తెదేపానే అసలు ఖాతరు చేయడంలేదు. ఒకవేళ ఏపిలో తెదేపాతో పొత్తులు లేకుంటే ఈపాటికి వారు తెదేపాపై కూడా కత్తులు దూస్తుండేవారేమో?
అవతలి పార్టీ తమ మిత్రుడో శత్రువో తెలియని ఈ అనిశ్చితే తెదేపా-భాజపాల పాలిట శాపంగా మారే అవకాశం ఉంది. కనుక స్నేహమా..రణమా? వారు తేల్చుకోవడం మంచిది.