ఛత్తీస్ గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మొన్న జవాన్లపై దాడి చేసి 25మందిని చంపేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతోందని గగ్గోలు పెట్టేసే వరవరరావు, ప్రజా సంఘాల నేతలు ఇంత దారుణం జరిగినా నోరు మెదపలేదు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “మావోయిస్టులు 25మంది జవాన్లను అతికిరాతకంగా హత్య చేసి వారి ఆయుధాలు దొంగిలించి పారిపొయినా, ప్రజా సంఘాల నేతలు, మానవ హక్కుల సంఘాల నేతలు కనీసం విచారం వ్యక్తం చేయలేదు. వారికి ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా కనిపించడం లేదా?ఎన్కౌంటర్ లో ఒక్క మావోయిస్టు చనిపోయినా ప్రభుత్వాన్ని, పోలీసులను తీవ్ర పదజాలంతో విమర్శించేవారు మావోలు చేసిన ఈ ఘాతుకంపై ఎందుకు స్పందించడం లేదు? వారికి ఒక రకమైన మానవ హక్కులు, పోలీసులు, జవాన్లకు మరొక రకమైన మానవ హక్కులు ఉంటాయని వారు భావిస్తున్నారా? ఇది వారి ద్వందప్రమాణాలకు అద్దం పడుతోంది. వారి తీరును, మావోల ఘాతుకాన్ని గమనిస్తున్న యావత్ దేశప్రజలు దీనిపై స్పందించాలి. మానవ హక్కుల సంఘాల ముసుగులో మావోల సానుభూతిపరులు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు. ఇటువంటి కుహనా హక్కుల సంఘాల నేతల నిజస్వరూపాలను బయటపెట్టవలసిన అవసరం ఉంది. మావోల దుశ్చర్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వారిని అణచివేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కటినమైన చర్యలు తీసుకొబోతున్నాయి,” అని వెంకయ్య నాయుడు హెచ్చరించారు.
తుపాకీ ద్వారా ఎన్నటికీ రాజ్యాధికారం రాదని దశాబ్దాలుగా మావోయిస్ట్ లతో అంటకాగిన ప్రజాకవి గద్దర్ చెపుతున్నారు. అందుకే వారి మార్గాన్ని విడిచిపెట్టి ప్రజాస్వామ్యవిధానంలోకి వచ్చానని చెపుతున్నారు. అంటే మావోల ఆలోచనా విధానమే తప్పు అని అయన చాటి చెపుతున్నట్లు అర్ధం అవుతోంది. వారిని విడిచిపెట్టి ప్రజాస్వామ్య విధానంలోకి మారిన గద్దర్ కూడా మావోల ఈ దుశ్చర్యను ఖండించకపోవడం శోచనీయం.
కాంగ్రెస్, వామపక్షాలు ఇంకా జాతీయపార్టీలమని గొప్పలు చెప్పుకొనే పార్టీల నేతలు కూడా బహుశః ఇదే కారణం చేత మావోల దుశ్చర్యపై స్పందించలేదని భావించవలసి ఉంటుంది. దీనిని బట్టి రాజకీయ పార్టీలు, వాటి నేతలు మావోలని చూసి ఎంతగా భయపడుతున్నారని..వారు కూడా ద్వందప్రమాణాలు పాటిస్తున్నారని స్పష్టం అవుతోంది. మన నేతలలో, పార్టీలలో ఈ భయం ఉంది కనుకనే మావోలు ఇంతగా రెచ్చిపోగలుగుతున్నారని భావించవచ్చు.
అదేవిధంగా మావోల ఈ దుశ్చర్యను ఆంధ్రా, తెలంగాణాలో ఏ ఒక్క రాజకీయ పార్టీ, నాయకుడు కూడా ఖండించలేదు. మావోల గురించి మాట్లాడి కోరుండి సమస్యలు ఆహ్వానించుకోవడం ఎందుకు అనే భయం వలన కావచ్చు లేదా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన దానితో మనకేమిటి సంబంధం అనే ఆలోచనతోకావచ్చు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించకపోవడం శోచనీయం. ఇటువంటి సమస్య తమకు ఎదురైతేనే స్పందించాలని, ఇరుగుపొరుగు రాష్ట్రాలలో జరిగిన వాటికి స్పందించనవసరం లేదనుకొంటే అది పొరిగింటికి నిప్పు అంటూకొంటే మనకు సంబంధం లేదనుకొన్నట్లే అవుతుంది.