“మరొక రెండేళ్ళు ఓపిక పడితే ఆనక మన పార్టీయే అధికారంలోకి వస్తుంది. మేము అధికారం చేపట్టగానే మీ కష్టాలన్నీ తీర్చేస్తాను. సినిమాలో 16 రీళ్ళ వరకు విలన్ దే హవా..17వ రీలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోతుంది. హీరో విలన్లని చిత్తుచిత్తు చేసేస్తాడు. అంటే చివరికి ధర్మమే గెలుస్తుందన్న మాట. న్యాయం, ధర్మం, క్రిందన ప్రజలు, పైన ఆ భగవంతుడు అందరూ మనవైపే ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో మన పార్టీయే ఘన విజయం సాదించి అధికారంలోకి రావడం ఖాయం. మీ కష్టాలు తీరడం కూడా అంతే ఖాయం.” గత మూడేళ్ళుగా నిత్యం ఈ మాటలు కాస్త అటుఇటూగా వినబడుతూనే ఉన్నాయి. అవి ఎవరివో వేరేగా చెప్పనవసరం లేదు.
ఇంత నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆత్మవిశ్వాసం తగ్గి దాని స్థానంలో భయం పెరుగుతున్నట్లుంది. బహుశః అందుకే వచ్చే ఎన్నికలలో తన పార్టీని ఒడ్డున పడేసేందుకు ఎన్నికల వ్యూహనిపుణుడు, ప్రశాంత్ కిషోర్ సేవలు ఉపయోగించుకోవడానికి సిద్దపడినట్లున్నారు. ఈమద్యనే జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ తో సమావేశమయ్యి, రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి, శక్తి సామర్ధ్యాల గురించి, తెదేపా సర్కార్ లోపాలు, బలహీనతలు, రాష్ట్రంలో నెలకొన్న ఇతర సమస్యల గురించి వివరించినట్లు సమాచారం.
మరో రెండేళ్ళ తరువాత వస్తాయనుకొన్న ఎన్నికలు 6 నెలలు ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తుండటం, ఆ ఎన్నికలు వైకాపా..దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యవంటివి కావడం చేత, జగన్ ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకొన్నట్లున్నారు. అయితే అది ఎన్నికలకు సన్నధం అవుతున్నట్లు కాకుండా రెండేళ్ళ ముందే జగన్ ఓటమిని అంగీకరించేసినట్లు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోందని చెప్పవచ్చు.
వాస్తవంగా చెప్పాలంటే, రాజధాని, మెట్రో రైల్ నిర్మాణం పనులు ఇంతవరకు మొదలుపెట్టలేకపోవడం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటువంటి హామీల అమలులో మాట తప్పడం, వైఫల్యం, తెదేపా సర్కార్ లో అవినీతి, దౌర్జ్యనాలు పెరగడం వంటి అనేక కారణాల చేత సహజంగానే ప్రజలలో తెదేపా పాలనపై కొంత అసంతృప్తి, అసహనం నెలకొని ఉంది.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, ఈ మూడేళ్ళలో జగన్ చేసిన పోరాటాల కారణంగా వైకాపాకు కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడిఉన్నాయి. కనుక గత ఎన్నికలలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్తపడితే తెదేపాను ఓడించడం జగన్ కు ఆసాద్యం కాదు. వైకాపాలో బొత్స, అంబటి వంటి అనేకమంది మంచి అనుభవజ్ఞులైన నేతలున్నారు. వారి సలహా సంప్రదింపులతో తెదేపాను డ్డీకొంటే సరిపోతుంది.
కానీ వచ్చే ఎన్నికలు తనకు, తన పార్టీకి జీవన్మరణ సమస్య వంటివి కావడంతో జగన్ తన శక్తి సామర్ధ్యాలను తనే తక్కువగా అంచనా వేసుకొని యూపిలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకి శల్యసారధ్యం చేసిన ప్రశాంత్ కిషోర్ సహాయం కోరారు. తద్వారా తెదేపాను ఓడించడం తన ఒక్కడివల్ల కాదని చాటి చెప్పుకొన్నట్లయింది. జగన్ నిర్ణయంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.