రిజర్వేషన్ల అంశం రాష్ట్రాలకే వదిలేయాలి: కేసీఆర్

April 25, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం సమావేశమయినప్పుడు ఏ కులం, మతం వర్గం వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకొనే అధికారం రాష్ట్రాలకే విడిచిపెట్టాలని కోరారు. ఒక్కో రాష్ట్రంలో వివిధ వర్గాల జనాభా ఒకేలా ఉండదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. కనుక దేశమంతటికీ ఒకే పద్ధతి అనుసరణీయం కాదు. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాలు వివిధ వర్గాల ప్రజల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నాయి. కనుక రిజర్వేషన్ల శాతం నిర్ణయించుకొనే అధికారం రాష్ట్రాలకే వదిలిపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కోరారు. జనాభా ప్రాతిపదికన ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల శాతం పెంచేందుకు తమ ప్రభుత్వం ఆమోదించిన బీసి-ఈ బిల్లు గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించి దానిని అందించాలని కోరారు. 

మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని భాజపా వ్యతిరేకిస్తోంది. అలాగే ‘ఒకే దేశం..ఒకే చట్టం..ఒకే ఎన్నికలు..’అని కేంద్రప్రభుత్వం నినదిస్తోంది. ఈ నేపద్యంలో రిజర్వేషన్ల గురించి కేసీఆర్ చేసిన సూచనలకు, తెరాస సర్కార్ ఆమోదించిన ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందిస్తారనుకోలేము.  “స్పందించకపోతే యుద్దానికి సిద్దం” అని కేసీఆర్ ముందే ప్రకటించారు. కనుక ఈ రిజర్వేషన్ల అంశంపై తెరాస, భాజపాల మద్య యుద్ధం జరగడం, దానిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొనడం అనివార్యమని స్పష్టం అవుతోంది. 

ప్రస్తుతం ఏపిలో కాపు రిజర్వేషన్ల అంశం ఆయుధంగా చేసుకొని తెదేపా సర్కార్ పై ముద్రగడ పద్మనాభం యుద్ధం చేస్తుంటే, ఆయనకు అండగా వైకాపా, కాంగ్రెస్ పార్టీలు నిలబడ్డాయి. మరోవైపు తెదేపా సర్కార్ బీసిల భుజం పై తుపాకి పెట్టి వారితో యుద్ధం చేస్తోంది.

అంటే ఈ రిజర్వేషన్లను అర్హులైన పేద ప్రజలకంటే రాజకీయ పార్టీలు..వాటి నేతలే ఎక్కువగా ఉపయోగించుకొంటున్నారని అర్ధం అవుతోంది. కనుక రిజర్వేషన్ల వలన నిజంగా దారిద్ర్యంతో మగ్గుతున్నవారందరికీ మేలు చేయాలనుకొంటే కుల,మతాల ఆధారంగా కాకుండా వారి ఆర్ధికస్థితిని బట్టి ఇవ్వడం వలననే ఆశించిన ఫలితాలు కనబడవచ్చు. అప్పుడు ఈ అంశంపై రాజకీయ పార్టీలు, వాటి నేతలు రాజకీయాలు చేయలేరు. అలాగే రిజర్వేషన్ల ద్వారా ఒక స్థాయికి ఎదిగిన వారు మళ్ళీ వాటిని ఉపయోగించుకోలేరు కనుక నిజంగా అర్హులైనవారికే అవి దక్కుతాయి. 


Related Post