చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు, మెగా హీరోలు అందరూ ఆయనకు అండగా నిలబడి ప్రచారం చేశారు. కానీ సుమారు 3 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపిస్తున్నప్పుడు, చిరంజీవి, నాగబాబు దానిని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించారు. చివరకి తమ అభిమానులను కూడా చీల్చే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో రామ్ చరణ్ తేజ్ సహజంగానే తండ్రికే మద్దతు ఇచ్చారు. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఒక్కవైపు, పవన్ కళ్యాణ్ ఒక్కరే మరొకవైపు నిలబడటం అందరూ చూశారు. కారణాలు అందరికీ తెలుసు.
2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందిన తరువాత చిరంజీవి మళ్ళీ సినిమాలు చేసుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. కనుక బహుశః చిరంజీవి ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. బహుశః అందుకే నాగబాబు, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ ఇప్పుడు మాట మార్చి పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతూ, అభిమానులను కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఈయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారేమో?
ఈ మూడేళ్ళ వ్యవధిలో వారి వైఖరిలో ఇంత పెను మార్పు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను ఒంటరి చేసిన మెగాహీరోలు ఇప్పుడు వారంతట వారే ఆయనకు అండగా నిలబడటానికి ముందుకు రావడం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ ఒప్పుకొంటే చిరంజీవి జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయాలని ఆలోచిస్తున్నారేమో? అని సందేహం కలుగుతోంది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటికీ ఆయనకు పదవులు, అధికారం మీద ఆశ లేదు గానీ చిరంజీవికి చాలా ఉందని స్వయంగా నిరూపించుకొన్నారు.
కానీ తాను జనసేనలో చేరుతానని, కనుక అభిమానులు అందరూ తమ్ముడికి మద్దతు ఇవ్వలని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది కనుక నాగబాబు, రామ్ చరణ్ తేజ్ ద్వారా తన మనసులో మాట చెప్పిస్తున్నారేమో? ఒకవేళ వచ్చే ఎన్నికలలో చిరంజీవి కాంగ్రెస్ తరపున పోటీ చేసినా గెలుస్తారనే నమ్మకం లేదు. అలాగని తెదేపా, భాజపా, వైకాపాలలో చేరలేరు. కనుక తమ్ముడు సిద్దం చేస్తున్న జనసేన పడవ ఎక్కే ఆలోచన చేస్తున్నారేమో? లేకుంటే నాగబాబు, రామ్ చరణ్ లకు హటాత్తుగా పవన్ కళ్యాణ్ ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చినట్లు?
మెగాహీరోల వైఖరిలో ఈ మార్పు ఏపిలో కాంగ్రెస్ శవపేటికకు మరోబలమైన మేకును కొట్టినట్లు అవుతుందని చెప్పక తప్పదు. కానీ ఇప్పటికే దాదాపు తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీకి చిరంజీవి గుడ్ బై చెప్పేసినంత మాత్రాన్న కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు.