వాటిని అప్పగించకపోతే నష్టపోయేది ఎవరు?

April 25, 2017


img

ఏపి సర్కార్ వెలగపూడిలో సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు నిర్మించుకొని అక్కడికి తన ఉద్యోగులను తరలించడంతో హైదరాబాద్ లో దాని అధీనంలో ఉన్న ఆ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని తమకు అప్పగించమని తెరాస సర్కార్ చేస్తున్న విజ్ఞప్తిని ఏపి సర్కార్ పట్టించుకోవడం లేదు. ఆ భవనాల అప్పగింతను షెడ్యూల్: 10 సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపకాలతో ముడిపెట్టింది. ఆ సమస్యలు పరిష్కరిస్తేనే తన అధీనంలో ఉన్న భవనాలను అప్పగిస్తామని మెలిక పెట్టింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు గవర్నర్ నరసింహన్ సమక్షంలో సమావేశమయ్యి చర్చిస్తున్నాయి కానీ పరిష్కారం లభించలేదు. కనుక నేటికీ హైదరాబాద్ లోని అనేక భవనాలు ఏపి సర్కార్ అధీనంలోనే నిరుపయోగంగా పడిఉన్నాయి. 

వాటిని వాపసు చేయకపోవడం వలన తెలంగాణా సర్కార్ వాటిని ఉపయోగించుకోలేకపోతున్నప్పటికీ, ఏపి సర్కార్ కు అవి గుదిబండల వలె మారాయని ఈ చిన్న ఉదాహరణ తెలియజేస్తోంది. 

హైదరాబాద్ నగరంలో ఆదర్శ్ నగర్, హైదర్ గూడాలో ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో కూడా ఏపి సర్కార్ వాటాగా కొన్ని క్వార్టర్లు కేటాయించబడి ఉన్నాయి. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చినప్పుడు వాటిని వినియోగించుకొంటుంటారు. గత మూడు నెలలుగా ఏపి సర్కార్ నిధుల కొరత కారణంగా వాటి విద్యుత్ చార్జీలు రూ.16 లక్షలు బకాయిలు చెల్లించలేకపోయింది. ఆ కారణంగా తెలంగాణా విద్యుత్ శాఖ అధికారులు ఏపి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. 

ప్రస్తుతం ఆ క్వార్టర్స్ లో ఉంటున్న ఒక ఆంధ్రా ఎమ్మెల్యే ఈ సమస్యను ఏపి రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖకు తెలియజేసి ఒత్తిడి చేయడంతో ఆ శాఖా అధికారులు వెంటనే రూ.16 లక్షలు బకాయిలు ఆన్-లైన్ ద్వారా చెల్లించేశారు. దానితో విద్యుత్ శాఖ అధికారులు మళ్ళీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు విద్యుత్ కనెక్షన్ పునుద్దరించారు. 

ఏపి ఎమ్మెల్యేలు కేవలం 3నెలలలో రూ.16 లక్షలు విద్యుత్ వినియోగించడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఏపి సర్కార్ ఈ దుబారాను ఎందుకు అరికట్టడం లేదో తెలియదు కానీ హైదరాబాద్ లోని ఒక్క ఏపి ఎమ్మెల్యే క్వార్టర్స్ ద్వారానే తెలంగాణా ప్రభుత్వానికి ఇంత ఆదాయం సమకూరుతుంటే, నగరంలో ఏపి సర్కారుకు ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలు, శాసనసభ, మండలి, సచివాలయంలో కొన్ని బ్లాకులకు విద్యుత్, నీటి పన్ను, మున్సిపల్ తదితర పన్నులు, ఫీజుల రూపేణా తెరాస సర్కార్ కు చాలా బారీగానే సొమ్ము  వస్తోందని అర్ధం అవుతోంది. కనుక ఆ భవనాలను అప్పగించకపోవడం వలన తెరాస సర్కార్ వాటిని ఉపయోగించుకోలేకపోతున్నప్పటికీ నష్టపోవడం లేదని స్పష్టమవుతోంది. కానీ ఏపి సర్కార్ పంతానికి పోయి నిరుపయోగంగా ఉన్న వాటి కోసం ఏటా కోట్ల రూపాయలు చెల్లించుకొంటూ నష్టపోతోందని అర్ధం అవుతోంది. కనుక వాటిని ఎంత త్వరగా తెలంగాణా ప్రభుత్వానికి అప్పగిస్తే అంత దానికే మంచిది. మరి ఏపి సర్కార్ ఇంకా ఎంతకాలం ఆ తెల్ల ఏనుగులను పోషిస్తుందో చూడాలి.


Related Post