పవన్ మానసిక స్థితిసరిగా లేదేమో?

April 24, 2017


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా భాజపాను, కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు సాగిస్తుండటంతో సహజంగానే భాజపా నేతలు అయనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ పేజీలో మళ్ళీ కేంద్రాన్ని విమర్శిస్తూ కొన్ని మెసేజ్ లు పెట్టడంతో భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఘాటుగా స్పందించారు. 

కేంద్రప్రభుత్వం గురించి పవన్ కళ్యాణ్ పొంతనలేని కామెంట్లు చేస్తుండటం చూస్తుంటే అయన మానసికస్థితిపై అనుమానం కలుగుతోంది. రాజకీయాలు అంటే సినిమా కాదు చిత్రవిచిత్రంగా వ్యవహరించడానికి. మాది దేశ సమగ్రత, జాతీయవాదమే ప్రధాన సిద్దాంతాలుగా నడుస్తున్న పార్టీ. మాకు ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. యావత్ దేశ ప్రజలు మాకు ఒకటే. ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపము. దేశంలో వివిధ రాష్ట్రాలలో పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుండటం చూస్తూనే ఉన్నాము. అయినా పవన్ కళ్యాణ్ మా ప్రభుత్వంపై ఇటువంటి అర్ధరహితమైన విమర్శలు, ఆరోపణలు చేయడం దేనికో అర్ధం కాదు. రాజకీయ నిరుద్యోగులే ఇటువంటి మెసేజ్ లు పెడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఇదివరకు ఆయన సోదరుడు చిరంజీవి కూడా ఆలాగే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, దానిని మంచి రేటుకు కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు. కనుక ఇప్పుడు తమ్ముడు తన పార్టీని ఏమి చేస్తాడో చూడాలి,” అని అన్నారు. 

పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ పేజీలో, కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నట్లుందని ఒక మెసేజ్ పెట్టి, దానికి సంబంధించి మీడియాలో ప్రచురితమైన రెండు కధనాలను పోస్ట్ చేశారు. కేంద్రప్రభుత్వం దక్షిణాదివారిని గౌరవించడం నేర్చుకోకపోతే అది పెద్ద సమస్యకు దారి తీస్తుందని హెచ్చరించారు. అందుకే భాజపా ఇంత ఘాటుగా స్పందించింది. 


Related Post