రాష్ట్రంలో 46 డిగ్రీల సూర్య ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు త్రాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంకో పక్క తెరాస 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ లో నిర్వహించబోతున్న బారీ బహిరంగ సభను నభూతో నభవిష్యత్ అన్నట్లు నిర్వహించడానికి శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తి చేసుకొన్నా సందర్భంగా ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు శతాబ్ది ఉత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సభ గురించి ప్రచార రధాలు, కనీసం 10-15 లక్షల జన జనసమీకరణ టార్గెట్స్, వేదిక, ప్రాంగణం, మజ్జిగ, మంచి నీళ్ళ ప్యాకెట్ల ఏర్పాట్లు ఒకటేమిటి ‘రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కరువా?’ అన్నట్లు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ముందస్తు ఎన్నికల గంటలు కూడా మ్రోగడం మొదలయ్యాయి కనుక వరంగల్ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలు అందరూ తెరాస వైపే ఉన్నారని నిరూపించుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుంది.
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిధిగా వస్తున్నారు. ఇంకా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారు. ఈ మూడు రోజుల ఉత్సవాలలో యూనివర్సిటీలో అనేక సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ఉపన్యాసాలు ఉంటాయి. కనుక ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా బారీగా, చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉస్మానియాలో వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధ విద్యాసంఘాలు ఉన్నాయి కనుక ఈ మూడు రోజులు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా విద్యార్ధి సంఘాల ప్రతినిధులతో పోలీస్ మరియు యూనివర్సిటీ ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి తదితర ప్రముఖులు వస్తున్నారు కనుక యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి.
ప్రస్తుతం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు అందరూ ఈ రెండు కార్యక్రమాలతో క్షణం తీరికలేకుండా ఉన్నారు. కనుక ఈ రెండు కార్యక్రమాలు పూర్తయితేగానీ మళ్ళీ ప్రజాసమస్యలపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వంలో ఎవరికీ ఖాళీ ఉండకపోవచ్చు.కనుక అంతవరకు అందరూ ఓపిక పట్టక తప్పదు.