రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి భాజపా, కాంగ్రెస్ పార్టీల నేతలను ఎద్దేవా చేస్తూ “భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ లో గల్లీగల్లీ తిరిగి ఇంటింటికీ వెళ్ళి స్వయంగా ప్రజలను బ్రతిమాలుకొన్నా భాజపా ఒక్క కార్పోరేట్ సీటు కూడా దక్కించుకోలేదు. అలాగే పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి గెడ్డం పెరుగుతుందేమో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదు. మరో పదేళ్ళపాటు రాష్ట్రంలో తెరాసయే అధికారంలో ఉంటుంది కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారు,” అని అన్నారు. చంపాపేటలో నిన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెరాస పార్టీ సమావేశంలో నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల క్రితమే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో ప్రభంజనం సృష్టిస్తున్న భాజపా వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్దంగా ఉంది. తెరాస అప్రజాస్వామికపాలనకు భాజపాయే ముగింపుపలుకబోతోంది,” అని అన్నారు.
అయితే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తెలంగాణా పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని రాష్ట్ర భాజపాకు కూడా తెలుసు. అలాగే ఈ మూడేళ్ళలో చాలా బలపడిన తెరాసను డ్డీకొనే శక్తి తమకు లేదని పదేపదే నిరూపితమైన దానిని వారు అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. అమిత్ షా సూచించినట్లు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయకుండా మోడీ నామస్మరణతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేయగలమనే భ్రమలో కాలక్షేపం చేస్తుండటం విచిత్రం.
తెలంగాణాలో అధికారంలో రావడం కంటే వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలు దక్కించుకోవాలనే సరికొత్త వ్యూహంతో అమిత్ షా పావులు కడుపుతున్నారు. ఆయన గట్టిగా పూనుకొంటే అదేమీ అసాధ్యం కాదు. కానీ రాష్ట్ర భాజపా నేతలలో కూడా ఆ పట్టుదల, కృషి ఉండాలి.
ఇక తెరాసను కాంగ్రెస్ ఏమీ చేయలేదని నాయిని చెప్పుకోవడం అతిశయోక్తే. కాంగ్రెస్ నుంచి అనేకమంది నేతలను తెరాసలోకి ఫిరాయింపజేసినప్పటికీ, కాంగ్రెస్ నేటికీ చెక్కుచెదరలేదు. తెరాస సర్కార్ గట్టి సవాల్ విసురుతూనే ఉంది. కాంగ్రెస్ నేతలు తమ విభేదాలు, పదవీ లాలసను పక్కన పెట్టి గట్టిగా పోరాడితే వారిని తట్టుకోవడం తెరాసకు కష్టమే అవుతుందని చెప్పకతప్పదు. వారి అనైక్యతే తెరాసకు శ్రీరామరక్ష. కానీ కాంగ్రెస్ నేతలు తమ ఈ బలహీనతలను గుర్తించి కలిసికట్టుగా పోరాడటం మొదలుపెట్టారు. కనుక కాంగ్రెస్ పార్టీని తెరాస నేతలు తక్కువ అంచనా వేస్తే వారే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.