అమెరికాపై అక్కసు దేనికి?

April 22, 2017


img

హెచ్1-బి వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ విదిస్తున్న ఆంక్షలపై భారత వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ వాదన అర్ధరహితంగా ఉంది. అమెరికాలో భారత ఐటి సంస్థలు ఉన్నట్లుగానే, భారత్ లోను అమెరికన్ సంస్థలు చాలా ఉన్నాయని, వాటి వలన అమెరికాకు బారీగా ఆదాయం సమకూరుతోందని ట్రంప్ సర్కార్ గుర్తుంచుకోవాలని అన్నారు.

ఈవిషయంలో ఆమె అమెరికాతో భారత్ ను పోల్చి మాట్లాడటం అర్ధరహితమే. ఎందుకంటే అమెరికా అభివృద్ధి చెందిన దేశం కనుకనే భారత్ తో సహా అన్ని దేశాల పౌరులు అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకొంటున్నారు. నేటికీ లక్షలాది మంది భారతీయులు అమెరికా వెళ్ళాలని తహతహలాడుతుండటమే అందుకు చక్కటి ఉదాహరణ. అందుకే హెచ్1-బి వీసాలపై   ట్రంప్ సర్కార్ విదిస్తున్న ఆంక్షల ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా ఉంది. కనుకనే ఈ మాటలన్నీ మాట్లాడుకోవలసి వస్తోంది. 

అమెరికాలో భారతీయ సంస్థలను స్థాపించడం అమెరికా కోసం కాదు..ఆయా సంస్థల వ్యాపార ప్రయోజనాల కోసమే. ఒకవేళ భారతీయ సంస్థలు అమెరికాలో స్థాపించకపోయినా అగ్రరాజ్యమైన అమెరికాకు పెద్ద తేడా ఉండదు. పైగా వాటిలో అమెరికన్లకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించనప్పుడు వాటి వలన అమెరికాకు ఒరిగేదేమీ ఉండదు. అందుకే అటువంటి కంపెనీలపై 35 శాతం వరకు పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.  

కానీ భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కనుక భారత్ లో పెట్టుబడులు పెట్టమని ప్రపంచదేశాలను ఆహ్వానిస్తోంది. వాటి వలన మన దేశంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఆర్ధికాభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వాటికి అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చి రప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటి వలన ఆయా దేశాలకు కొంత ఆదాయం లభిస్తున్నప్పటికీ, వాటి వలన మన దేశమే ఎక్కువ ప్రయోజనం పొందుతోందని చెప్పవచ్చు. కనుక భారత్, అమెరికాలో ఉన్న విదేశీ సంస్థలను పోల్చి చూడటం సరికాదనే చెప్పవచ్చు. 


Related Post