తెలంగాణాలో వేసవి వేడి కంటే ఎన్నికల వేడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు అ వేడి పొరుగునే ఉన్న ఆంధ్రకు కూడా పాకింది. ముందస్తు ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలని చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు పిలుపునివ్వడంతో అకస్మాత్తుగా ఏపిలో కూడా ఎన్నికల వేడి పెరగడం మొదలైంది.
ఈసారి శాసనసభ, లోక్ సభ ఎన్నికలు రెండూ కలిపి ఒకేసారి నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నందున 6 నెలల ముందుగానే అంటే నవంబర్ 2018 లోగానే ఎన్నికలు రావచ్చని, కనుక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీలో అందరూ సిద్దంగా ఉండాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక నుంచి రోజూ సాయంత్రం పార్టీ సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు.
వచ్చే ఎన్నికలలో వైకాపాయే గెలుస్తుందని, అప్పుడు తనే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానని కలలుకంటూ ఎన్నికల కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న జగన్మోహన్ రెడ్డి, బాబు ముందస్తు ప్రకటనపై ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యమే. కానీ ఇంకా పార్టీ నిర్మాణమే పూర్తి చేసుకోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ “ఒకవేళ ఎన్నికల యుద్ధం ముందుగా వస్తే జనసేన సిద్దమే” అని ట్వీట్ చేయడం విశేషం.
ఈరోజు నుంచి అనంతపురంలో జనసేన పార్టీ నిర్మాణం మొదలుపెట్టినప్పటికీ, అది పూర్తయి అందరూ తమతమ పదవులలో నిలద్రొక్కుకొని ప్రజలలోకి వెళ్ళడానికి కనీసం మరో 10-12 నెలలు పట్టవచ్చు. వచ్చే ఎన్నికలలో తెదేపాతో పొత్తులు పెట్టుకోవాలా వద్దా? అనేది ఇంకా తేల్చుకోవలసి ఉంది. దానిని బట్టి ఎన్నికల వ్యూహం రూపొందించుకోవలసి ఉంటుంది. ఒకవేళ పొత్తులు పెట్టుకోదలిస్తే సీట్లు పంపకాలు చేసుకోవాలి. తరువాత పార్టీకి బలమైన అభ్యర్ధులను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. తెదేపాతో పొత్తులు పెట్టుకొంటే దానికి మిత్రపక్షంగా ఉన్న భాజపాతో ఏవిధంగా వ్యవహరించాలి? అని ఆలోచించుకోవాలి. తెదేపాతో పొత్తు వద్దనుకొంటే తెదేపా, భాజపా, వైకాపాలను ఏవిధంగా ఎదుర్కోవాలి? అని వ్యూహరచన చేసుకోవాలి.
ఇక తెలంగాణాలో కూడా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు కనుక అక్కడ పార్టీ నిర్మాణం, పొత్తులు, అభ్యర్ధులు..వగైరాల గురించి ఆలోచించుకోవలసి ఉంటుంది. అక్కడా తెరాస ధాటికి కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్షాలు తట్టుకోలేక విలవిలలాడుతుంటే, ఎన్నికలకు ముందు ఎంట్రీ ఇస్తే తెరాసను డ్డీ కొనగలమా? లేకపోతే పరిస్థితి ఏమిటి? అని పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవలసి ఉంటుంది.
మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆలోచించేరో లేదో తెలియదు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి జనసేన రెడి అని ప్రకటించేశారు.