తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీలో సాగుతున్న ఆదిపత్యపోరులో పన్నీర్ సెల్వంకు ఊహించని విధంగా అవకాశాలు వస్తున్నా వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కినప్పుడు, ఆయన పార్టీపై..ప్రభుత్వంపై పట్టు సాధించలేకపోవడం వలన అకస్మాత్తుగా శశికళ తెరపైకి రాగలిగింది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సెల్వం ఆమెను నియంత్రించే ప్రయత్నం చేసే బదులు ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆనక ఆమె ఆదేశించగానే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మరో పెద్ద తప్పు చేశారు. ఆ తరువాత ఆమెపై తిరుగుబాటు చేసినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తమిళ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే సినీ పరిశ్రమ ఆయనకు అండగా నిలబడినా పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోలేకపోయారు.
ఆ తరువాత సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడినప్పటికీ, పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోలేకపోయారు. అప్పుడు ఊహించని విధంగా పళనిస్వామి ముఖ్యమంత్రి అయిపోయారు.
జయలలిత ప్రాతినిద్యం వహించిన ఆర్.కె. నగర్ నియోజకవర్గం ఉపఎన్నికలు రావడంతో సెల్వం వర్గానికి మళ్ళీ మరో అవకాశం వచ్చింది. కానీ కారణాలు ఎవయితేనేమి ఉపఎన్నికలు రద్దు అయిపోయాయి. పార్టీ చిహ్నం కోసం దివాకర్ చేసిన పెద్ద తప్పు కారణంగా సెల్వంకి మళ్ళీ బంగారంలాంటి మరో గొప్ప అవకాశం కలిగింది. సెల్వంతో రాజీ పడేందుకు పళనిస్వామి వర్గం దిగివచ్చింది.
కానీ సెల్వం వెనుక కనీసం డజను మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోయినా ఆయన తనకే ముఖ్యమంత్రి పదవి, పార్టీ పగ్గాలు అప్పగించాలని, అన్నాడిఎంకె పార్టీ ఎన్డీయే కూటమిలో చేరాలని అంటూ ఏవేవో షరతులు విదిస్తూ తాడుని తెగే వరకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన షరతులతో విసిగి వేసారిపోయున్న పళనిస్వామి వర్గం ఒకవేళ సెల్వంతో చేతులు కలుపకూడదని నిర్ణయించుకొంటే, పన్నీర్ సెల్వంకి ఆయాచితంగా లభించిన ఈ ఆఖరి అవకాశం కూడా కోల్పోతారు. అప్పుడు ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. కనుక పన్నీర్ సెల్వం ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించి మళ్ళీ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం సంపాదించుకొంటారో లేక ఏకాకిగా మిగిలిపోతారో చూడాలి.