హద్దులు మీరితే సోషల్ మీడియా అయినా...

April 21, 2017


img

‘కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే’ అన్నట్లుగా ఎంత పెద్ద రాజకీయ పార్టీ, ప్రభుత్వం, నేత, సినిమా, పరిశ్రమ, అంశం ఏదయినా సరే సోషల్ మీడియాకు లోకువగానే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో     ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలపై దాదాపు యుద్దాలే జరుగుతుంటాయి. సినిమాలపై ఎన్ని యుద్దాలు చేసుకొన్నా అవి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆడుతున్నంతవరకే పరిమితం అవుతాయి కనుక వాటి వలన పెద్ద ఇబ్బంది ఉండదు కానీ రాజకీయ యుద్దాలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చునని ఇంటూరి రవి కిరణ్ అరెస్ట్ తో నిరూపితం అయ్యింది. 

అతను సోషల్ మీడియాలో ‘పొలిటికల్ పంచ్’ పేరుతో రాజకీయ కార్టూన్లు వేస్తుంటారు. వైకాపా దాని అధ్యక్షుడు జగన్ వీరాభిమాని అయిన రవి కిరణ్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ శాసనసభపై అనుచితమైన వ్యంగ్య కార్టూన్లు, వేసినందుకు తెదేపా సర్కార్ ఆగ్రహించింది. ఏపి శాసనసభ కార్యదర్శి సత్యన్నారాయణ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిన్న రాత్రి శంషాబాద్ చేరుకొని ఇంటూరి రవి కిరణ్ ను అతని నివాసం నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. చట్టసభలను కించపరిచేవిధంగా ఎవరు ప్రవర్తించినా ఈవిధంగా కటినమైన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 

యువతకు దగ్గర కావాలంటే సోషల్ మీడియా ఒక్కటే దగ్గర దారి అని రాజకీయ పార్టీలన్నీ సోషల్ బాట పడుతున్న సమయంలో అదే సోషల్ మీడియాలో కొందరు పార్టీల వారిగా చీలిపోయి జీవితంలో ఏనాడూ మొహాలు కూడా చూడనివారితో భీకర యుద్దాలు చేస్తుంటారు. అభిమానం దురాభిమానంగా మారడం వలననే హద్దులు మరిచిపోయి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈవిధంగా చిక్కుల్లో పడుతుంటారు. 

ఈ కేసులో రవి కిరణ్ వైకాపా వీరాభిమాని కావడం తప్పు కాదు. కానీ అది దురాభిమానంగా మారడంతో ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడు లోకేష్ ను, చట్టసభలను లక్ష్యంగా చేసుకొని నిరంతరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పొరపాటు. 

దీనిలో కనబడుతున్న మరో కోణం ఏమిటంటే, సాక్షి మీడియాలో నిత్యం తెదేపా వ్యతిరేక వార్తలే వస్తుంటాయి. అది ఒక మీడియా అనే సంగతి మరిచి, అది కూడా మరొక ప్రతిపక్ష పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక జగన్, రోజా, చెవిరెడ్డి, అంబటి, బొత్స తదితర వైకాపా నేతలు అందరూ నేరుగా చంద్రబాబునే లక్ష్యం చేసుకొని చాలా తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. వారి అధినేత జగన్ఒ అయితే మరొకడుగు ముందుకు వేసి “ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టండి...చీపుర్లతో కొట్టండి..”అంటూ జగన్ ప్రజలను రెచ్చగొడుతుంటారు.  వారిపై తెదేపా సర్కార్ ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతోందో దానికే తెలియాలి. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు సోషల్ మీడియాపై తన ప్రతాపం చూపడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తద్వారా సోషల్ మీడియాకు బలమైన సందేశమే పంపగలిగింది కానీ అదే సమయంలో తనను విమర్శిస్తున్నవారి గొంతును అణచివేస్తోందనే అభిప్రాయం కూడా కలిగించిందని చెప్పక తప్పదు. కనుక ప్రభుత్వంమూ, మీడియా రెండూ సంయమనం, స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరమే.  


Related Post