కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య విధానాలను గౌరవించడంలో దేశంలో మిగిలిన అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీయే మిన్న అనే విషయంలో బహుశః ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండకపోవచ్చు. కాంగ్రెస్ హయంలో అవినీతిని పక్కనపెడితే, ప్రజలు, మీడియా, ప్రతిపక్షాల స్వేచ్చ స్వాతంత్ర్యాలను హరించే ప్రయత్నాలు చేయడం చాలా తక్కువేనని చెప్పవచ్చు. అదే ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అవి విమర్శలను సహించలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే కాక ఆ పార్టీలో కూడా స్వేచ్చా, స్వాతంత్ర్యాలు కాస్త ఎక్కువేనని అందరికీ తెలుసు. కానీ ఈ నియమం కాంగ్రెస్ అధిష్టానదేవతలను వేలెత్తి చూపించేవారికి వర్తించదు. ఎవరైనా సోనియా, రాహుల్ గాంధీలను వేలెత్తి చూపిస్తే వెంటనే వారిపై బహిష్కరణ వేటుపడటం ఖాయం. డిల్లీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న బర్ఖా శుక్లా సింగ్ రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించినందుకు ఆమెపై బహిష్కరణ వేటు పడింది.
“పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కి నాయకత్వం వహించేందుకు తగినంత మానసిక పరిపక్వత, నాయకత్వ లక్షణాలు లేవని చెపుతున్నారు. పార్టీ సమస్యల గురించి మాట్లడాలనుకొనేవారితో రాహుల్ గాంధీ మాట్లాడరు. ఆయన ఎందుకు వెనుకాడుతున్నారో తెలియదు. అయన తనకు భజన చేసేవారినే ఎక్కువగా నమ్ముతుంటారు. ఆ కారణంగా కాంగ్రెస్ అనేకమంది మంచి నేతలను దూరం చేసుకొంది,” అని ట్వీట్ చేశారు.
అలాగే ఆమె డిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మఖన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఆయన, రాహుల్ గాంధీ ఇద్దరూ ఎన్నికలలో ఓట్ల కోసం మహిళాసాధికారకత గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. అది కేవలం ఉపన్యాసాలకే పరిమితం. ఆచరణలో కనబడదు. నాతో సహా అనేకమంది మహిళా కాంగ్రెస్ నేతల పట్ల అజయ్ మఖన్ చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఆయనపై పిర్యాదు చేస్తే రాహుల్ గాంధీ పట్టించుకోరు,” అని ఆరోపించారు.
ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తే ఏమవుతుందో ఆమె ముందే ఊహించారు. కనుక ఆమె నిన్ననే తన పదవికి రాజీనామా చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని ఆమె చెప్పారు. కానీ ఆమె భాజపాలో చేరవచ్చని తెలుస్తోంది.
ఆమె విమర్శలు, ఆరోపణలను పక్కనబెడితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్యకు ఏకైక పరిష్కారం దాని గురించి ప్రశ్నించినవారిని బయటకు సాగనంపడమేనని భావిస్తునట్లుంది. ఈ మూడేళ్ళలో రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించిన కొంతమందిని బయటకు పంపారు. ఇప్పుడు బర్ఖా శుక్లా సింగ్ ను బయటకు పంపడం చూస్తే ఇది నిజమేననిపిస్తుంది.