వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న టి-కాంగ్రెస్, నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో బహిరంగసభతో ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్ఘే, కుంతియా హాజరయ్యారు. వారితో బాటు రాష్ట్ర నేతలు చాలా మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఇస్తే దాని వలన కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడింది. తెలంగాణా ఇవ్వకుంటే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పదవులు దక్కేవా? వారి కుటుంబపాలనకు ముగింపు పలుకవలసిన సమయం దగ్గరపడుతోంది. వచ్చే ఎన్నికలలో తెరాసను బయటకు సాగనంపి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. మేము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తాము. అలాగే యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలనెలా నిరుద్యోగ భ్రుతి అందిస్తాము. తెరాస సర్కార్ కు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదు కనుకనే లోపభూయిష్టమైన బిల్లును రూపొందించి శాసనసభ చేత ఆమోదింపజేసుకొంది. అది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తయారుచేసినదే తప్ప ఎవరికీ అదనంగా రిజర్వేషన్లు కల్పించడానికి కాదు. తెరాస ఎన్నికల హామీల అమలుకోసం తెరాస సర్కార్ తో నిర్విరామంగా పోరాడుతూనే ఉంటాము,” అని అన్నారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉండగానే అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు గుప్పిస్తుండటం విచిత్రమే. తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ఆదాయానికి, కేటాయింపులకి ఎక్కడా పొంతన లేదని, అది ప్రకటించిన పధకాలకు ఎక్కడి నుంచి నిధులు తీసుకువస్తుందని శాసనసభ బడ్జెట్ సమావేశాలలో జానారెడ్డి ప్రశ్నించారు. రేపు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అది చెట్టు దులిపి డబ్బు తేలేదు. ఆకాశంలో నుంచి వాన కురిసినట్లు డబ్బు కురవదు. అప్పుడూ ఇదే ఆర్ధిక పరిస్థితి ఉండవచ్చు లేదా ఇంకా దిగజరవచ్చు. తెరాస సర్కార్ లక్ష రూపాయలలోపు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయలేక 4 దశలలో చేయవలసి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి 2 లక్షలు ఏవిధంగా మాఫీ చేయాలనుకొంటోందో వివరిస్తే బాగుండేది.
అలాగే ఏపిలో తెదేపా అధికారంలోకి వస్తే నిరుద్యోగభ్రుతి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ మూడేళ్ళు అవుతున్నా దానిని అమలుచేయలేకపోతోంది. మరి ఈ హామీ అమలుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి నిధులు తీసుకువస్తుంది? ఎంతమందికి ఇస్తుంది? చెపితే బాగుండేది. తెరాస సర్కార్ ఎన్నికల హామీలను అమలుచేయనందుకు దానిపై ప్రస్తుతం పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతే రేపు తాము కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుందని గ్రహించిందో లేదో కానీ నోటికి వచ్చినట్లు హామీలు గుప్పిస్తోంది.