కేటిఆర్ కి ముఖ్యమంత్రి కావచ్చు అన్నట్లుగా తెరాస ప్రజలకు సంకేతాలు పంపి దానిపై ప్రజాస్పందన ఏవిధంగా ఉంటుందో పరీక్షించుకోవాలనుకొంటే, దానిపై కేటిఆర్, కవిత, హరీష్ రావు మాట్లాడినమాటలను ప్రతిపక్షాలు ఆయుధాలుగా మలుచుకొని తెరాసపై ప్రయోగిస్తుండటం విశేషం. కేటిఆర్, హరీష్ రావు మద్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని, ఆ కారణంగా హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్ళే యోచనలో ఉన్నారనే సంకేతాలు పంపినట్లయింది.
దానిపై కాంగ్రెస్ నేత ఉమేష్ రావు స్పందిస్తూ, హరీష్ రావు చాలా సమర్ధుడైన నేత. ఆయనను తెరాస పక్కనపెట్టడం బాధాకరం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే తప్పకుండా స్వాగతిస్తాము. అయన తెరాసలో కంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఎక్కువ రాణిస్తారు. ఆయన వలన మా కాంగ్రెస్ పార్టీ కూడా లాభపడుతుంది,” అని అన్నారు.
జగ్గారెడ్డి స్పందిస్తూ, “తెరాసలో ముసలం పుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు కేటిఆర్ కోసం మేనల్లుడు హరీష్ రావును పక్కనపెట్టారు. తెరాసలో ఉండగా హరీష్ రావు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. అయన కాంగ్రెస్ లోకి వస్తే మంచిదే,” అని అన్నారు.
మరో కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, “తెరాసలో బావాబావామరుదుల మద్య కోల్డ్ వార్ నడుస్తోంది. మా పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. కనుక ఎవరో రావాలని ఏదో చేయాలని మేము ఎదురుచూడనక్కరలేదు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీయే తెరాసకు ఏకైక ప్రత్యమ్నాయం,” అని అన్నారు.
కాంగ్రెస్ నేతలు తెరాసలో చిచ్చు రాజేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికీ, కేసీఆర్ ఉన్నంత వరకు వారి ప్రయత్నాలు ఫలించవని ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. కనుక తెరాసలో చిచ్చు రగిలించడం కోసం సమయం వృధా చేసుకొనే బదులు తమ పార్టీలో నాయకత్వ సమస్యలను ముందుగా పరిష్కరించుకొంటే మంచిది కదా!