దినకరన్ చూపింది తెలివా..త్యాగమా?

April 19, 2017


img

గాలికి ఎగిరిపోతున్న పేలాలను 'కృష్ణార్పణం' అని పలికి పుణ్యం మూటగట్టుకోవాలని ఆశపడినట్లుగా, ఎలాగూ తనను పార్టీ నుంచి బహిష్కరించారు కనుక శశికళ మేనల్లుడు దినకరన్ తానే పార్టీకి దూరంగా ఉంటానని ప్రకటించేశారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, కనుక తన వల్ల అన్నాడిఎంకె పార్టీకి నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు. తనను పార్టీ ఎలాగు బయటకు పంపించింది కనుక ఇక తాను పార్టీ ఉపకార్యదర్శి పదవికి రాజీనామా చేయవలసిన అవసరం లేదని చెప్పారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు కలిసి పనిచేస్తే పార్టీ బలపడుతుందని అదే తాను కూడా కోరుకొంటున్నానని దినకరన్ చెప్పారు. పార్టీ నుంచి నన్ను బయటకు పంపించివేసినప్పటికీ పార్టీలో అందరూ తన సోదరులు వంటివారేనని అన్నారు. తాను ఎప్పటికీ అన్నాడిఎంకె పార్టీకి విధేయుడిగానే ఉంటానని దినకరన్ చెప్పారు. 

ముందు తిరుగుబాటుకి సిద్దం అయిన దినకరన్, ఎన్నికల కమీషన్ కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయి పోలీస్ కేసులో చిక్కుకోవడంతో పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఒకవేళ పార్టీపై పట్టు కోసం ప్రయత్నించినా అందరూ ఏకమై తనను బలవంతంగానైనా బయటకు గెంటి వేస్తారు. పైగా డిల్లీ పోలీసులు ఏ క్షణానైనా చెన్నై వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కనుక ఈ సమయంలో పార్టీపై తిరుగుబాటు చేయడం కంటే స్వయంగా పార్టీ నుంచి తప్పుకొని విధేయత చూపించితే కనీసం అందరి సానుభూతి, అవసరమైతే సహాయసహకారాలు లభిస్తాయని భావించి ఉంటారు. అందుకే దినకరన్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. అది చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు.  


Related Post