తమిళనాడు అన్నాడిఎంకె పార్టీలో గత ఆరేడు నెలల నుంచి నేటి వరకు జరుగుతున్న విపరీత పరిణామాలు బహుశః మరే పార్టీలోను జరుగవేమోననిపిస్తుంది. జైలుకి వెళ్ళినా పార్టీని, ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకొన్న శశికళ, తన మేనల్లుడు దినకరన్ ని పార్టీ పగ్గాలు అప్పగిస్తే, పేనుకు పెత్తనం ఇస్తే తలను బోడిగుండు చేసిందన్నట్లుగా, అతను ఎన్నికల కమీషన్ కే రూ.50 కోట్లు లంచం ఇచ్చే ప్రయత్నం చేసి తను బుక్ అయిపోవడమే కాకుండా అన్నాడిఎంకె పార్టీని కూడా రోడ్డున పడేశారు.
ముఖ్యమంత్రి పళనిస్వామి వెంటనే అప్రమత్తమయ్యి తన ప్రత్యర్ధి పన్నీర్ సెల్వంతో చేతులు కలపడానికి సిద్దపడ్డారు. పన్నీర్ వర్గం డిమాండ్ మేరకు శశికళ, దినకరన్ వారి కుటుంబ సభ్యులు అందరినీ పార్టీ నుంచి దూరంగా ఉంచుతామని ముఖ్యమంత్రి తరపున ఆ రాష్ట్ర ఆర్ధికమంత్రి జయకుమార్ నిన్న రాత్రి ప్రకటించారు. పన్నీర్-పళని రెండు వర్గాల విలీనమయ్యి, పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనేది నిర్ణయించుకొన్న తరువాత శశికళ అండ్ కో ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించవచ్చు.
పార్టీలో ఎక్కువ కాలం అనిశ్చితి కొనసాగితే అది తమకే ప్రమాదం అనే సంగతి ముఖ్యమంత్రి పళనిస్వామి గ్రహించే ఉంటారు. అలాగే ఊహించని విధంగా వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకొంటే మళ్ళీ మరోమారు ఇటువంటి అవకాశం రాకపోతే తనే నష్టపోతానని పన్నీర్ సెల్వం కూడా గ్రహించే ఉండవచ్చు. కనుక తమ తమ ప్రయోజనాల కోసం ఇద్దరు చేతులు కలిపి, శశికళ అండ్ కో ను పార్టీ నుంచి బయటకు గెంటివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
జయలలిత మృతితో అకస్మాత్తుగా తెరపైకి వచ్చి ఒక వెలుగువెలిగిన శశికళ, ఆమె జైలుకి వెళ్ళడంతో తెరపైకి వచ్చిన దినకరన్ ఎంత వేగంగా పైకి ఎదిగారో అంతకంటే వేగంగానే అధఃపాతాళానికి చేరుకోవడం విచిత్రం.