తెరాసది ఆత్మవిశ్వసమా..అతివిశ్వసమా?

April 18, 2017


img

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ తమవైపే ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామని నేతలు గట్టిగా చెప్పుకొంటారు. యూపిలో సమాజ్ వాదీ పార్టీ కూడా తమ ఓటమి పక్కా అని గ్రహించినప్పటికీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేవరకు అలాగే చెప్పుకొంది. అది ఆత్మవంచన చేసుకోవడమని ప్రజలు భావిస్తే, ఆవిధంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం రాజకీయాలలో ఆనవాయితీ అని ఆ పార్టీ నేతలు సర్దిచెప్పుకోవచ్చు. అంచనాలు తప్పితే ఓడలు బళ్ళు అయ్యే అవకాశం ఉందని అది నిరూపిస్తోంది. 

ప్రస్తుతం తెరాస తీరు కూడా అలాగే ఉంది. తమ పార్టీకి 101-106 శాసనసభ స్థానాలు వస్తాయని కేసీఆర్ జోస్యం చెపుతారు. కేటిఆర్ ముఖ్యమంత్రి అయితే తనకు అభ్యంతరం లేదని హరీష్ రావు చెపుతారు. ‘నాకు ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరిక లేదు. మరో 10-20 ఏళ్ళు వరకు కేసీఆరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని కేటిఆర్ చెపుతారు. తెలంగాణాలో తెరాస తప్ప మరేపార్టీని ప్రజలు ఆదరించరని కూడా చెపుతారు. ఈ మాటలు వారి ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతున్నాయని వారు భావిస్తుంటే అవి ప్రజలను “టేకెన్ ఫర్ గ్రాంటేడ్” గా తీసుకొంటున్నట్లు ఉన్నాయని ప్రతిపక్షాల వాదన. వాటికి ఎవరు ఏ పేరు పెట్టుకొన్నా ఆ మాటలలో చాలా అతిశయంగా కనిపిస్తుంటుంది. 

తెరాస సర్కార్ చాలా చురుకుగా, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొంటున్న మాట వాస్తవమే. కనుక తమ ప్రభుత్వ పాలనపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని తెరాస నేతలు గట్టిగా నమ్ముతూ ఆవిధంగా మాట్లాడటం సహజమే. కానీ అదే సమయంలో రైతులు, విద్యార్ధులు, సింగరేణి కార్మికులు, మేధావులు ఇంకా వివిధ వర్గాల ప్రజలలో తెరాస సర్కార్ పట్ల బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం కళ్ళకు కనబడుతూనే ఉంది. అంటే ప్రజలలో అసంతృప్తి ఉందనుకోవాలా లేక తెరాస నేతలు చెప్పుతున్నట్లు ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకోవాలా? 

తెరాస సర్కార్ భగీరధ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో అప్పుడే చాలా ప్రాంతాలలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉంది. ఇంకా అనేక సమస్యలను పరిష్కరించడంలో కనబడుతున్న అలసత్వం లేదా ఆలస్యం కారణంగా భాదిత వర్గాలు తీవ్ర అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా తెరాస నేతలు “ఆల్ ఈజ్ వెల్... ఆల్ ఈజ్ వెల్...”అని సర్దిచెప్పుకొంటే కధ నిజంగానే సుఖాంతం అవుతుందా?అని ఆలోచించడం మంచిది. 

“రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు..ఉంటే అవి గత ప్రభుత్వాల కారణంగానే నెలకొని ఉన్నాయి..రాష్ట్రంలో తెరాస తప్ప మరే పార్టీని ప్రజలు ఆదరించరు..కాంగ్రెస్ ను యావత్ దేశప్రజలు తిరస్కరించారు కనుక తెలంగాణాలో ప్రజలు కూడా తిరస్కరిస్తారు. ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ ఏజంటు..భాజపాకు ఉత్తరాదిన మాత్రమే ఆదరణ ఉంది తెలంగాణాలో ఉండదు.. తెదేపా చచ్చిన పామువంటిది..” అని సర్ది చెప్పుకొంటే వాటికేమి నష్టం ఉండదు కానీ ప్రజలలో అసంతృప్తి పెరిగితే తెరాసను పక్కన పెట్టి వాటిలో దేనికో ఒక దానికి పట్టం కట్టవచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలున్నాయి. కనుక తెరాస సర్కార్ వాస్తవ పరిస్థితులను నిజాయితీగా అంచనా వేసుకొని తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగడం దానికే మంచిది. 


Related Post