జమ్ము కాశ్మీర్ లో ఏమి జరుగుతోంది?

April 15, 2017


img

జమ్మూ కాశ్మీర్ లో విపరీత పరిణామాలు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా చోద్యం చూస్తోంది. మొన్న ఉపఎన్నికల కోసం ఈవిఎంల(ఓటింగ్ యంత్రాలు)ను తీసుకొని వెళుతున్న భద్రతాసిబ్బందిని వేర్పాటువాదులు కాళ్ళతో తన్నారు. కొందరు కాశ్మీరీ యువకులు జవాన్లను బండ బూతులు తిట్టారు. “మీ భారతీయులకు ఇక్కడ ఏమి పని?” అని నిలదీశారు. జవాన్ల చేత “ఆజాద్ కాశ్మీర్ జిందాబాద్” అని బలవంతంగా నినాదాలు చేయించారు. 

ఆ సమయంలో భద్రతాసిబ్బంది చేతుల్లో తుపాకులు ఉన్నప్పటికీ, మరో చేతిలో ఈవిఎంలు ఉన్నందున వారు చాలా ఓపికగా ఆ హింసని భరించి తమకు అప్పగించిన పనిని సమర్ధంగా నిర్వహించారు. భద్రతాదళాలపై వేర్పాటువాదులు రాళ్ళు రువ్వడం అక్కడ చాలా సాధారణమైన విషయమే అయినప్పటికీ ఇంత సాహసం చేయలేకపోయారు. 

వేర్పాటువాదుల ఈ దుశ్చర్యలను చూసి చాలా మంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ వీడియోని చూసి దేశవిదేశాలలోని నెటిజన్లు కూడా వేర్పాటువాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేకమంది ప్రముఖులు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 

సరిగ్గా ఇదే సమయంలో భారత ఆర్మీని వేలెత్తి చూపక తప్పని సంఘటన ఒకటి జరిగింది. శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఆదివారం పోలింగ్ జరుగుతున్న సందర్భంగా వేర్పాటువాదులు ఎక్కడికక్కడ భద్రతాదళాలపై రాళ్ళు రువ్వుతూ దాడులకు పాల్పడుతున్నారు. వారి దాడుల నుంచి తప్పించుకొనేందుకు 53వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కొందరు జవాన్లు ఫరూక్ దార్ అనే ఒక పౌరుడిని తమ జీపుకు ముందుభాగంలో కట్టేసి, అతనిని మానవ కవచంలాగ ఉపయోగించుకొన్నారు. అతను ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా జవాన్లు అతనిని పట్టుకొని తమ జీపుకు కట్టివేసి 12 గ్రామాలలో తిప్పారు. 

ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్త్రుతంగా షేర్ అవుతోంది. జవాన్ల మీద మొన్న దాడులు జరిగినప్పుడు గట్టిగా ఖండించినవారే, ఇప్పుడు దీనినీ గట్టిగా ఖండిస్తున్నారు. ఇది చాలా హేయమైన పనే. కానీ జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవడానికి ఈ రెండు సంఘటనలు ఉపయోగపడతాయి. జవాన్లపై దాడులు జరిగినప్పుడు స్పందించని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, జవాన్లు చేసిన పనిని గట్టిగా ఖండించడమే కాకుండా వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరడం విశేషం. 


Related Post