సింగరేణిలో మళ్ళీ మెల్లగా చిచ్చు రగులుతోంది. దానిని తెరాస సర్కార్ చూస్తున్నా ఆర్పే ప్రయత్నాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ చిచ్చుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
1.వారసత్వ ఉద్యోగాల అమలుచేయాలని. 2. ఓపెన్ కాస్ట్ మైనింగ్ (ఓసి) మానుకోవాలని.
మొదటి దానిపై తెరాస సర్కార్ చొరవ తీసుకొని జీవో జారీ చేసినపుడు గొప్పగా భుజాలు చరుచుకొన్న తెరాస నేతలు అందరూ ఇప్పుడు దానిపై కామికులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే నోరు మెదపకపోవడం విచిత్రం.
దానిపై హైకోర్టు స్టే విదించినప్పుడు సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెరాస సర్కార్ ప్రకటించింది. కానీ రెండు నెలలు గడుస్తున్నా అటువంటి ప్రయత్నమేదీ చేయకపోవడంతో సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అదునుగా ప్రతిపక్షాలు కూడా సుప్రీంకోర్టులో ఎందుకు సవాలు చేయలేదంటూ తెరాస సర్కార్ ను గట్టిగా నిలదీస్తున్నాయి. దానికీ తెరాస నేతల నుంచి జవాబు రావడంలేదు. కనుక సింగరేణి యూనియన్ల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ హడావుడిగా అప్పుడు ఆ నిర్ణయం ప్రకటించారనే ప్రతిపక్షాలు వాదనకు బలం చేకూరుతోంది. సింగరేణిలో తెరాస అనుబంద యూనియన్ నేతలు కూడా దీనిపై పెదవి విప్పకపోవడం ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోవడంతో తెరాస సర్కార్ చిత్తశుద్ధిని అందరూ శంఖిస్తున్నారు. కార్మికుల ఆందోళన అర్ధం చేసుకొని వారి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా సింగరేణిలో 6నెలలపాటు సమ్మెను నిషేధిస్తున్నట్లు తెరాస సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం వారికి పుండు మీద కారం జల్లినట్లయింది.
సింగరేణి కార్మికుల సంక్షేమమే తనకు చాలా ముఖ్యం అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను ఇంకా ఎప్పుడు, ఏవిధంగా పరిష్కరిస్తారో ఎవరికీ తెలియదు. ఈలోగా పదవీ విరమణ దగ్గర పడుతున్న కార్మికులలో ఆందోళన రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.
ఇక రెండవ సమస్య ఓసి. దీని వలన వేలాది ఎకరాల బంగారంవంటి భూమి బొందలగడ్డలాగ మారిపోతోందని, ఆ కారణంగా పరిసరప్రాంతాలలో పంటలు, పర్యావరణం అన్నీ దెబ్బ తింటున్నాయని కనుక తక్షణమే దానిని నిలిపివేయాలని కోరుతూ ఓసి వ్యతిరేక పోరాట జెఏసి నేతలు బుధవారం నుంచి ఆ ప్రాంతాలలో బస్సు యాత్ర చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తెరాస అధికారంలోకి వస్తే ఓసిని తక్షణం నిలిపివేస్తానని చెప్పిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన 6 నెలలోనే 14 ఓసిలకు ఎందుకు అనుమతించారని వారు ప్రశ్నిస్తున్నారు. (ఓసిలను కొనసాగించడానికి గల కారణాలను వేరేగా చర్చించుకొందాం).
ఈ రెండు సమస్యలకు తెరాస సర్కార్ పరిష్కారం చూపకపోతే, బొగ్గుబాయిలో నిప్పు రాజుకోవడం ఖాయం. అప్పుడు ఆ మంటలను ఆర్పడం కష్టం అవుతుంది కనుక చేతులు కాలక ముందే మేల్కొనడం మంచిది కదా!