తెరాస అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మంత్రి నాయిని ప్రకటించారు. నేటి నుంచి ఏప్రిల్ 18 వరకు అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన, 20న ఉపసంహరణ, 21న కొంపల్లిలో జరుగబోయే ప్లీనరీలో అధ్యక్షుని పేరు ప్రకటిస్తామని నాయిని చెప్పారు. ఎన్నికల కమీషన్ నియామావళి ప్రకారం అన్ని పార్టీలు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలి గనుక నిర్వహిస్తుంటాయి. ఆనక ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించుకొన్నామని భుజాలు చరుచుకొంటాయి. అయితే పార్టీలో వేరే ఏ పదవికైనా నామినేషన్లు వేయవచ్చునేమో కానీ అధ్యక్ష పదవికి వేయడానికి వీలు లేదనేది ఒక అప్రకటిత నియమం ఉంది. దేశంలో అన్ని పార్టీలు దానిని నిఖచ్చిగా పాటిస్తుంటాయి. తెరాస కూడా అందుకు మినహాయింపు కాదు.
మన దేశంలో ఏ పార్టీలో అయినా ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి లేదా అతని అనుమతితో అతని వారసులు మాత్రమే ఆ పదవికి నామినేషన్ వేసేందుకు అర్హత కలిగి ఉంటారు. నామినేషన్లు వేసే అవకాశం ఉంది కదాని.. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వేస్తే, అది పార్టీ ధిక్కార చర్యగా భావించబడుతుంది కనుక వారు పార్టీ నుంచి బయటకు గెంటివేయబడతారు. ఈ సంగతి అందరికీ తెలుసు కనుకనే ఎవరూ ఆ సాహసానికి పూనుకోలేదు..బయటకి పోయిన దాఖలాలు లేవు. కనుక తెరాస అధ్యక్షుడుగా కేసీఆర్ ఎంపిక కేవలం మొక్కుబడి తంతు మాత్రమే. అందుకే అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పే బదులు 21న అధ్యక్షుని పేరు ప్రకటిస్తామని నాయిని చెప్పారనుకోవచ్చు.
ఈ నియమానికి దేశంలో భాజపా, వామపక్షాలు మాత్రమే అతీతంగా ఉన్నాయని చెప్పవచ్చు. వాటిలో వారసత్వ రాజకీయాలు లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. కానీ వాటిలో కూడా కొన్ని అదృశ్యశక్తులు అధ్యక్ష పదవికి ఎవరు నామినేషన్ వేయాలో సూచిస్తుంటాయి. ఆ ప్రకారమే ఎంపిక జరిగిపోతుంటుంది. దీనికే మన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం అని అందమైన ముసుగువేసుకొంటాయి. అయితే ఈ వంశపారంపర్యంగా అధికార బదిలీ చూస్తుంటే రాజులు..నవాబులు..రాజ్యాలు..పోయినా రాచరికవ్యవస్థ పదిలంగా ఉందనిపిస్తుంది.