ఆఫ్ఘానిస్తాన్ లో అచిన్ జిల్లాలో గల కొండ గుహలలో నక్కిన ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అమెరికా వాయుసేన గురువారం రాత్రి ‘అన్ని బాంబులకు తల్లి’ వంటిదని చెప్పబడే జీజీయూ-43/బి బాంబును ప్రయోగించింది. ఆ బాంబు దాడిలో 36మంది ఐసిస్ ఉగ్రవాదులు, వారి ఆశ్రయాలు, ఆయుధ సామాగ్రి అన్నీ ద్వంసం అయినట్లు అమెరికా పేర్కొంది. దీని వలన ఐసిస్ ఉగ్రవాదులకు తప్ప పరిసర ప్రాంతాలలో నివసించే సామాన్య ప్రజలెవరికీ నష్టం జరుగలేదని పేర్కొంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సేనల ప్రతాపాన్ని మెచ్చుకొన్నారు.
ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అమెరికా ఇంత చొరవ తీసుకోవడాన్ని మెచ్చుకోవలసిందే. అయితే ఇది నిజంగా ఆ ఉద్దేశ్యంతోనే ఈ దాడి చేసిందా లేక ఎప్పుడో ఇరాక్ యుద్ద సమయంలో తయారుచేసిన ఆ బాంబు వృధాగా పడి ఉందని, దానిని ఈవిధంగా ఉపయోగించిందా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే అమెరికా సేనలు చాలా కాలంగా ఆఫ్ఘనిస్తాన్ లో పెద్దగా హడావుడి చేయడం లేదు. ఒకవేళ అడపా దడపా దాడులు చేసినా డ్రోన్ లతో చిన్న చిన్న బాంబులనే ఎక్కువగా వినియోగిస్తోంది. కానీ నిన్న ప్రయోగించింది మాత్రం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వంటిదేనని చెప్పవచ్చు. కనుక దానిని ఎందుకు ప్రయోగించింది? అనే అనుమానం కలగడం సహజం.
అమెరికా ఎప్పటికప్పుడు కొత్తకొత్త అత్యాధునికమైన ఆయుధాలు తయారుచేసుకొంటూనే ఉంటుందనేది జగమెరిగిన రహస్యం. అయితే వాటిని పరీక్షించి చూసుకొనేందుకు అవకాశం లేదు కనుక ఈవిధంగా ఆఫ్ఘానిస్తాన్, సిరియా దేశాలలో ఉగ్రవాదులపై ప్రయోగించి చూసుకొంటున్నట్లు అనుమానం కలుగుతోంది. మొన్న సిరియాలో దాడులు చేసినప్పుడు అమెరికా నావికాదళం ప్రయోగించిన క్షిపణుల ప్రత్యేకత గురించి ఇదేవిధంగా అంతర్జాతీయంగా చాలా పెద్ద చర్చ జరగడం గమనిస్తే, తన శక్తి సామర్ధ్యాలను ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలనే అమెరికా ఆశయం నెరవేరినట్లే కనిపిస్తుంది. కానీ ఎందుకీ ప్రదర్శన? అనే సందేహం కలుగుతుంది.
చైనా దక్షిణ సముద్రంలో గత కొన్ని నెలలుగా అమెరికా, చైనాల మద్య ఘర్షణ జరుగుతోంది. ఇరుదేశాల యుద్ద నౌకలు దాదాపు ఎదురెదురుగా మొహరించి యుద్దానికి సిద్దం అన్నట్లున్నాయి. ఉత్తరకొరియా కూడా యుద్దానికి సవాలు విసురుతోంది. సిరియాపై బాంబులు ప్రయోగించిన తరువాత అక్కడ కూడా అమెరికా, రష్యాల మధ్య యుద్దవాతావరణమే నెలకొని ఉంది. కనుక వాటికి తన శక్తి సామర్ధ్యాలను చాటుకొనేందుకే అమెరికా తనవద్ద ఉన్న ఇటువంటి శక్తివంతమైన బాంబులు, క్షిపణులు ప్రయోగిస్తోందని అనుమానం కలుగుతోంది.
ప్రపంచదేశాలను రక్షించేందుకు అమెరికా సైనికులు ఎందుకు బలి కావాలి? అమెరికా అభివృద్ధికి ఖర్చు చేయవలసిన సొమ్మును ప్రపంచ దేశాల రక్షణ కోసం ఎందుకు ఖర్చు చేయాలి? అని ఎన్నికల సమయంలో ప్రశ్నించిన డోనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు అదే పని చేస్తుండటం మరో విశేషం. అంటే అమెరికాని ఎవరు పాలించినా వారు యుద్ధం చేయకుండా ఉండలేరని, అది అమెరికా బలహీనత అని చెప్పకతప్పదు.