ఏపి సిఎం చంద్రబాబు హైదరాబాద్ లో కట్టుకొన్న ఇంటిపై వైకాపా కాకులు వాలి చాలా గోల చేస్తున్నాయి. అదేమీ నేరం కాదు. కానీ అది దేశద్రోహ నేరం అన్న స్థాయిలో వైకాపా విమర్శలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బాబుని విమర్శించే బాధ్యత కలిగిన వారిలో ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. ఆమె నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “విడిపోయిన రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టుకొన్నారు? ఏపికి సిఎం.గా ఉన్న వ్యక్తి పొరుగు రాష్ట్రంలో ఎందుకు ఇల్లు కట్టుకొన్నారు? దానికి ఎంత ఖర్చు పెట్టారు? వివరణ ఇవ్వాలి. ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వలేకపోయారు. కానీ తన వద్ద డబ్బు లేదంటూనే కోట్లు రూపాయలు ఖర్చు చేసి విలాసవంతమైన ఇల్లు ఎలాగ కట్టుకొన్నారు. అమరావతిలో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ హైదరాబాద్ లో ప్రభుత్వోద్యోగులందరినీ బెదిరించి, భయపెట్టి బలవంతంగా రప్పించారు. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొన్నారు. దాని అంతర్యం ఏమిటి?” అని రోజా ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికలలో వైకాపా చేతిలో తెదేపా ఓడిపోవడం ఖాయం అని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చని మరో నేత అన్నారు.
అర్ధరహితమైన ఈ విమర్శలకు వేరే కారణం కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ పిటిషన్ వేయడం, ముంబైలో జగన్ కు చెందిన సూట్ కేసు కంపెనీ ఒకటి ఉన్నట్లు ఈడి ప్రకటించడం వంటి సంఘటనలు, సహజంగానే నోరున్న తెదేపా నేతలకు ఉత్సాహం కలిగించాయి. వెంటనే వారు జగన్ అక్రమాస్తుల కేసుల గురించి మాట్లాడుతూ, హైదరాబాద్, కడప, బెంగళూరు లో జగన్ కట్టుకొన్న విలాసవంతమైన ఇళ్ళ ప్రస్తావన తెచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పొరుగు రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి పోయే ఏకైక ప్రధానప్రతిపక్ష నేత జగన్ ఒక్కడే అని విమర్శించారు.
బహుశః ఆ విమర్శలను మనసులో పెట్టుకొనే వైకాపా నేతలు ఇప్పుడు చంద్రబాబుపై ఈ విమర్శలు చేస్తున్నట్లున్నారు.
గతంలో ఉన్న ఇంటిని కూలగొట్టి దాని స్థానంలోనే చంద్రబాబు ఇల్లు కట్టుకొన్న సంగతి తెలిసిందే. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్, బెంగళూరు లో ఇళ్ళు కట్టుకొంటే తప్పుకానప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొంటే తప్పేమిటి? అయిన హైదరాబాద్ ఏమీ పొరుగు దేశంలో లేదు కదా?
ప్రభుత్వం పనితీరుని లేదా దానిలోటుపాట్లని ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తే ఏమైనా అర్ధం, ప్రయోఅజనం ఉంటుంది. రాజకీయ పార్టీలు వ్యక్తిగత స్థాయిలో చేసుకొనే ఇటువంటి విమర్శల వలన రాజకీయాల స్థాయి మరింత దిగజార్చుకొన్నట్లు అవుతుంది. అప్పుడు బాధపడేది వారేనని ఈ విమర్శలు, ప్రతివిమర్శలు నిరూపిస్తున్నాయి.