కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయాలు..కీచులాటలు కామన్. కనుక కాంగ్రెస్ నేతల నుంచి అందుకు భిన్నంగా ఏమీ ఆశించలేము. సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన విమర్శలు విన్నట్లయితే అది నిజమేనని ఒప్పుకొంటాము.
“కేసీఆర్ ఎప్పుడూ ప్రగతి భవన్ కే పరిమితమైపోయి అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ప్రజలలోకి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. జ్యోతిబా పూలేకి నివాళులు అర్పించడానికైనా ఆయన ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. అది బీసీలను అవమానించడమే. జ్యోతిబాకి నివాళులు అర్పించడానికి కేసీఆర్ వద్ద సమయం ఉండదు కానీ గవర్నర్ నరసింహన్ కలవాలంటే మాత్రం క్షణం ఆలస్యం చేయరు. ఆయన ఒక తెరాస నేతలాగా గవర్నర్ నరసింహన్ కు భజన చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది మానుకొంటే హుందాగా ఉంటుంది,” అని అన్నారు.
మహనీయుల ఆశయాలను ఆచరించడం కంటే వారి పేరు చెప్పుకొని ఏవిధంగా రాజకీయం చేయాలి? సంబంధిత వర్గాల ప్రజలను ఏవిధంగా ఆకర్షించాలి? అనేవే నేడు ముఖ్యం అయిపోయాయి. ప్రస్తుతం ఉన్న చట్టానికి అతీతంగా దళితులు, బీసిలు, ముస్లింలు తదితర బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి, ఉన్నవాటిని ఇంకా పెంచడానికి కేసీఆర్ మార్గాన్వేషణ చేస్తున్న సంగతి అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రయత్నాలకు భాజపాతో సహా కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కేసీఆర్ వెనక్కి తగ్గడం లేదు. ఆయా వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం అంబేద్కర్, జ్యోతిబా పూలేకి అసలైన నివాళి కాదా? వారి విగ్రహాలకు పూలదండలు వేసి మీడియాకు ఫోజులు ఇవ్వడమే నివాళా? అని ఆలోచిస్తే కేసీఆర్ చేస్తున్నదే అసలైన నివాళి అని అర్ధం అవుతుంది.
అలాగే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ చాలా జోరుగానే సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం చాలా అవసరమే. కానీ వారి సమస్యలను పరిష్కరించడం అంతకంటే ముఖ్యం. ప్రస్తుతం కేసీఆర్ అదే చేస్తున్నారు. సమర్ధుడైన ముఖ్యమంత్రి పరుగులు తీయనవసరం లేదు. తన క్రింద పనిచేసే వారినందరినీ సక్రమంగా పని చేయిస్తే సరిపోతుంది. ప్రస్తుతం కేసీఆర్ అదే చేస్తున్నారు. హనుమంతరావు వంటి కాంగ్రెస్ నేతలు అది చూడలేకపోవచ్చు లేదా చూసినా చూడనట్లు నటించవచ్చు కానీ ప్రజలు చూస్తూనే ఉన్నారు.