వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో కనీసం 6 లోక్ సభ సీట్లు గెలుచుకోవాలనే సరికొత్త వ్యూహంతో భాజపా ఇప్పటి నుంచే చురుకుగా పావులు కదపడం విశేషం. దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటక తరువాత భాజపాకు కొద్దిగా పట్టున్న రాష్ట్రం తెలంగాణాయే కనుక ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేస్తే రాష్ట్రంపై పట్టు సాధించవచ్చని భాజపా భావించడం సహజమే. కానీ తెలంగాణా రాష్ట్రంలో భాజపా అధికారం సంపాదించడం చాలా కష్టమేననే సంగతి భాజపా అధిష్టానం గ్రహించినట్లే ఉంది. అందుకే అది తెలంగాణా నుంచి లోక్ సభ స్థానాలు సంపాదించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ తన అధికారం నిలబెట్టుకోవడం కోసం అవసరమైన లోక్ సభ స్థానాలు సంపాదించుకోవలసి ఉంటుంది కనుక అందుకు కాస్త అనువుగా ఉన్న తెలంగాణాపై కూడా భాజపా దృష్టి సారించినట్లుంది. ఈ పని మీదే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చి, నగరంలోని బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అవుదామనుకొన్నారు. కానీ అనివార్య కారణాల వలన రాలేకపోయారు.
ఈరోజు అదే పనిమీద ఇద్దరు కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్, పురుషోత్తం కడాబాయ్ రూపాల తెలంగాణాలో పర్యటించబోతున్నారు. వారిలో రాధామోహన్ సింగ్ వరంగల్ రూరల్ జిల్లాలో, పురుషోత్తం రూపాల కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇరువురూ కూడా స్థానిక భాజపా నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అయ్యి వారికి దిశా నిర్దేశం చేయబోతున్నారు. వారిలో పురుషోత్తం రూపాలను కరీంనగర్ లోక్ సభ నియోజక వర్గానికి ఇన్-ఛార్జ్ గా నియమించడం గమనిస్తే, ఈ విషయంలో భాజపా ఎంత సీరియస్ గా తీసుకొని పనిచేస్తోందో అర్ధం చేసు కోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకొంటోంది కనుక అది శాసనసభ స్థానాలను గెలుచుకోవడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతూ అందుకు తగిన వ్యూహాలను సిద్దం చేసుకొంటోంది. ఎన్నికలకు ఏడాది ముందుగానే పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తామని ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించడమే అందుకు నిదర్శనం. కనుక తెరాస కూడా ఇప్పటి నుంచే తగిన ఎన్నికల వ్యూహాలను తయారుచేసుకొని అమలు చేయడం అవసరముంది.