గులాబీ కూలా..గులాబీ వసూళ్ళా?

April 13, 2017


img

 తెరాస ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ లో జరుగబోయే బహిరంగ సభ కోసం నిధులు సమీకరించుకోవడానికి పార్టీలో మంత్రులు మొదలు కార్యకర్తలు వరకు అందరూ ‘గులాబీ కూలి’ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తాను కూడా రెండు రోజులు గులాబీ కూలి చేసి నిధులు సమీకరిస్తానని కేసీఆర్ చెప్పారు. 

తెరాస అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ బహిరంగ సభకు ప్రభుత్వ నిధులు వాడకూడదనుకోవడం మెచ్చుకోవలసిన విషయమే. అయితే గులాబీ కూలి పేరిట మంత్రులు, ప్రజా ప్రతినిధులు రోడ్డు పక్కన టీ కొట్లో ఛాయ్ తయారు చేసి అమ్మడం, బట్టలు ఇస్త్రీ చేయడం, మంగలి, చెప్పులు కుట్టే పనులు చేసి నిధులు సమీకరించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయవలసినవారు ఇటువంటి పనులు చేయడం ప్రజలను అపహాస్యం చేయడమే. 

ఒక ఛాయ్ ఖరీదు రూ.5 లేదా రూ.10 ఉంటుంది. బట్టలు ఇస్త్రీకి రూ.10-20 ఉండవచ్చు. కానీ వాటికి రూ.500, 1,000,10,000 వచ్చిందని చెప్పుకోవడం అంటే అర్ధం ఏమిటి? అంత డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు? అది గులాబీ కూలి పేరిట బలవంతపు వసూళ్లు చేయడమే కదా? అంతకంటే తెరాస నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ చందాలు వేసుకొని బహిరంగ సభ నిర్వహించుకొంటే గౌరవప్రదంగా ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ఎప్పుడూ అందరికీ ఆదర్శప్రాయంగా మెలగాలి. వారి గురించి భావితరాలు కూడా గొప్పగా చెప్పుకొనేవిధంగా వ్యవహరించాలి. అధికారంలో ఉన్నవారు ఒకసారి ఇటువంటి దుసంప్రదాయలను ప్రవేశపెడితే అదీ ఎప్పటికీ ఒక దురలవాటుగా నిలిచిపోతుందని గ్రహించాలి.


Related Post