సామాజిక స్వరూపాన్ని బట్టే రిజర్వేషన్లు: కేసీఆర్

April 12, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వ విధానాలను, ఆలోచనలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలతో పంచుకొన్నారు. “తెలంగాణా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఒకప్పుడు మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు ఏర్పాటు చేసుకొన్న రిజర్వేషన్లు ఇప్పుడు పనికిరావు.   రాష్ట్రంలో వివిధ కులాలు, జనాభా, వారి స్థితిగతుల ఆధారంగానే రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకోవాలి. అంటే సమాజం స్వరూపాన్ని, అవసరాలను బట్టే చట్టాలు రూపొందించుకోవడంగా భావించవచ్చు. రాష్ట్రంలో బీసిలు, ఎస్టీల సంఖ్య గతంలో వేసిన లెక్కల కంటే ఎక్కువే ఉంది. వారిలో చాలా మంది పరిస్థితులు బాగోలేదు. కనుక వారికి న్యాయం చేకూరే విధంగా రిజర్వేషన్లు కల్పిస్తాము. ఇంకా సంచార జాతులవారికి కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించవలసి ఉంది, అని కెసిఆర్ చెప్పారు.

వివిధ రాష్ట్రాలలో ఉన్న రిజర్వేషన్ల గురించి వివరిస్తూ "తమిళనాడులో 69 శాతం, జార్ఖండ్ లో 60, మహారాష్ట్రాలో 52, ఈశాన్య  రాష్ట్రాలలో 80 శాతం వరకు రిజర్వేషన్లు ఇస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా మన జనాభా స్వరూపాన్ని బట్టి రిజర్వేషన్లు కల్పించుకోవడమే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించవలసి ఉంది. అప్పుడే అందరూ అభివృద్ధి ఫలాలను అందుకోగలుగుతారు.

మేము అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల స్థితిగతులను లోతుగా అధ్యయనం చేయడానికి వేర్వేరుగా కమిటీలు వేశాము.  బీసి కమీషన్ కూడా వేరేగా అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేసింది. కనుక శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తరువాతనే రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాము కనుక ప్రతిపక్షాలు మాకు సహకరించాలని కోరుతున్నాము,” అని కేసీఆర్ అన్నారు. 


Related Post