తెలంగాణా ఏర్పడిన కొత్తలో ప్రజలు క్షణికావేశంలో తెరాసకు ఓటేసి అధికారం కట్టబెట్టారని, ఇప్పుడు అందుకు చాలా బాధపడుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ ఈ మాట అన్నారు.
సాధారణంగా కాంగ్రెస్ లేదా మరో పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ప్రజల తీర్పును గౌరవిస్తామని, ఆత్మపరిశీలన చేసుకొని లోపాలను సవరించుకొంటామనే పడికట్టు డైలాగులు చెపుతాయి.
కొన్ని రోజుల తరువాత, ఎన్నికలలో గెలిచిన పార్టీ రకరకాల మోసాలు చేసి గెలిచిందని వాదించడం మొదలుపెడతాయి. అందుకు తాజా ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను చెప్పుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎవరికి వారు తమ పార్టీయే తప్పకుండా బారే మెజార్టీతో గెలుస్తుందని చెప్పిన ప్రతిపక్షాలు, ఇప్పుడు భాజపా ఈవిఎం మెషిన్లను ట్యాంపరింగ్ చేసి గెలిచిందని ఆరోపిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఆ దశ కూడా ముగిసిన తరువాత చివరిగా “ప్రజలు ఆలోచించకుండా ఓట్లు వేశారని” ప్రతిపక్ష పార్టీలు తేల్చి చెపుతుంటాయి. ఇక్కడ ఉత్తం కుమార్ రెడ్డి, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నారు. అంటే ప్రజలకు ఆలోచించే శక్తి లేదని, వారిని ఎవరు మభ్యపెడితే వారికే గుడ్డిగా ఓట్లు వేసేస్తారని చెపుతున్నట్లుంది. అదే..గెలిచిన పార్టీ మాత్రం ప్రజలు చాలా వివేకవంతులని సమర్దుల చేతికే అధికారం అప్పజెప్పారని పొగుడుతుంటాయి. ఇక్కడ తెరాస అక్కడ తెదేపా ప్రస్తుతం అలాగే చెప్పుకొంటున్నాయి.
ప్రజల వివేకం పట్ల రాజకీయ పార్టీలకి ఎంత చులకన భావం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, తెరాస గెలవడానికి కారణాలు అందరికీ తెలుసు. కనుక తమ ఓటమిని, లోపాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రజలను తక్కువగా అంచనా వేస్తూ కాలక్షేపం చేసేబదులు వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు ఏమి చేయాలో కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తే వారికే మంచిది.