ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకో రేటు!

April 08, 2017


img

ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతీ మూడు నెలలకు ఒకసారి సవరించేవారు. గత రెండేళ్ళుగా ప్రతీ 15 రోజులకి ఒకసారి సవరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలకు అనుగుణంగా ఇప్పుడు ప్రతీరోజు సవరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పద్ధతి అభివృద్ధి చెందిన దేశాలలో విజయవంతంగా అమలుచేస్తున్నారు. భారత్ లో కూడా ఆవిదానాన్ని అమలుచేయాలని పెట్రోలియం కంపెనీలు ప్రభుత్వాన్ని చాలా కాలంగా కోరుతున్నాయి. ఆ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కనుక కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

విదేశాలలో...ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు బలమైన చట్టాలు వాటిని అంతే సమర్ధంగా అమలుచేసేందుకు బలమైన వ్యవస్థలు ఉంటాయి కనుక ఈ విధానం అక్కడ విజయవంతం అవుతోంది. కానీ భారత్ లో పెట్రోల్ బంకులలో కల్తీలు, తూనికలో మోసాలు జరుగుతున్నాయని తెలిసినా పట్టించుకొని వ్యవస్థలున్నాయి మనకు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు బారీగా తగ్గిపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి మన పెట్రోలియం కంపెనీలకు మనసొప్పదు. వ్యాట్ అనో మరొక పేరుతోనో పెట్రోల్, డీజిల్ పై బారీగా పన్నులు వడ్డించి ప్రజలను పిండుకొనే ప్రభుత్వాలు మనకున్నాయి. ఇటువంటి వ్యవస్థలో ఈ కొత్త విధానం వలన సామాన్య ప్రజలకు ఇంకా ఎంతో కొంత నష్టపోవలసి ఉంటుందే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. 

అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు బారీగా తగ్గినా 15 రోజులకొకసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి వెనుకాడే మన పెట్రోలియం కంపెనీలు, రోజువారిగా ధరలు తగ్గిస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరిగిన మరుక్షణం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి ఈవిధానం బహు చక్కగా వాటికి ఉపయోగపడుతుంది. ఒకవేళ పెట్రోలియం కంపెనీలు ధరలు తగ్గించినా, ఆ సమాచారం తమకు అందలేదని సాకుతో పెట్రోల్ బంకులు ప్రజల నుండి అధికధరలు వసూలు చేయకుండా ఉంటారా? అని ఆలోచిస్తే సమాధానం ఏమిటో అందరికీ తెలుసు.

ఈ నూతన విధానం అమలుచేయాలని పెట్రోలియం కంపెనీలు, ప్రభుత్వాలు కోరుకోవడం ద్వారానే దాని వలన వాటికి ఎక్కువ ప్రయోజనం  ఉంటుందని స్పష్టం అవుతోంది. ఏ నూతన విధానమైనా లేదా సంస్కరణలైనా సామాన్య ప్రజలకు లబ్ది, మేలు కల్పించాలి కానీ వారి జీవితాలను ఇంకా ఇంకా దుర్భరం చేస్తుండటం బాధాకరం. 


Related Post