ఇటీవల ఆర్మూర్ లో జరిగిన తెరాస బహిరంగ సభలో భవిష్యత్ లో కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నట్లు నిజామాబాద్ ఎంపి కవిత మాట్లాడగా మంత్రి కేటిఆర్ కూడా అదేవిధంగా మాట్లాడటం విశేషం. దానితో అప్పుడే మీడియాలో అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. త్వరలోనే కేసీఆర్ తప్పుకొని కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉందనే సంగతిని కేసీఆర్ గుర్తించారని, కనుక వచ్చే ఎన్నికలలో తెరాసకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు లేకపోలేదని, అందుకే ఈలోగానే తన కొడుకును ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అవి నిజమో కాదో తెలియదు కానీ రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్నవారెవరైనా ఏదో ఒకరోజు కేటిఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పగలరు.
నిజానికి ఒకవేళ వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాల నుంచి లేదా కొత్తగా ఏర్పడబోయే పార్టీల నుంచి తెరాసకు గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లయితే, ఇప్పుడు ఆయన అటువంటి ఆలోచనే చేయరు. ఆ ఎన్నికలలో కూడా పార్టీకి తనే స్వయంగా సారద్యం వహించి విజయం సాధించిన తరువాతే, ముఖ్యమంత్రి పీఠాన్ని తన కొడుకుకు అప్పగించవచ్చు.
ఒకవేళ ఆయన చెపుతున్నట్లు వచ్చే ఎన్నికలలో తెరాస 102-106 అసెంబ్లీ సీట్లు, 11-15 ఎంపి సీట్లు అవలీలగా గెలుచుకోగలదనే నమ్మకం ఉన్నట్లయితే, ఆ క్రెడిట్ తన కొడుకు కేటిఆర్ పద్దులో జమా చేసి అతనికి ఇంకా గొప్ప పేరు సంపాదించిపెట్టేందుకు, ఎన్నికలలోగానే తన పదవిని కొడుకుకు అప్పగించవచ్చు. అందుకు ఉదాహరణగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను చెప్పుకోవచ్చు.
తెరాసకు అసలు పట్టే లేని గ్రేటర్ లో ఘనవిజయం సాధించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత, ఖచ్చితంగా 100 కు పైగా సీట్లు సాధించుకొంటామనే నమ్మకం ఏర్పడిన తరువాతే, గ్రేటర్ ఎన్నికలకు హరీష్ రావు వంటి తెరాస ముఖ్యనేతలను అందరినీ దూరంగా పెట్టి కేటిఆర్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఒకవిధంగా గ్రేటర్ విజయాన్ని ఆయన బంగారు పళ్ళెంలో పెట్టి కొడుకుకు అప్పగించినట్లు చెప్పవచ్చు. ఆ తరువాత కేటిఆర్ రాజకీయ గ్రాఫ్ ఏవిధంగా పైకి దూసుకుపోయిందో అందరూ చూశారు. అయితే అందుకు కేటిఆర్ తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోగల గుణం, ప్రజాసమస్యలపై వెంటనే స్పందించే అలవాటు వంటి అనేకం ఆయన ఎదుగదలకు తోడ్పడ్డాయని అందరికీ తెలుసు.
కనుక ఒకవేళ కేసీఆర్ వచ్చే ఎన్నికలలో కూడా ‘గ్రేటర్ ఫార్ములా’నే అమలు చేయాలనుకొంటున్నట్లయితే, వచ్చే ఎన్నికలలోగానే కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేయవచ్చు. ఒకవేళ రాష్ట్రంలో తను చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పూర్తి చేయాలనుకొంటే మరో ఐదేళ్ళ తరువాత ఈ అధికార బదిలీ జరుగవచ్చు. ఏడూ ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికలలో కూడా తెరాస విజయం సాధించినట్లయితే ఏదో ఒక రోజు కేటిఆర్ ముఖ్యమంత్రి అవడం పక్కా!