ఉత్తముడే కాంగ్రెస్ రధసారధి..పక్కా!

April 08, 2017


img

అన్ని పార్టీలలో పదవుల కోసం నేతలు పోటీ పడుతుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అది మరికాస్త ఎక్కువ. అలాగే ముఠాలు కట్టడం, పరస్పరం విమర్శలు చేసుకోవడం కూడా కాస్త ఎక్కువే. దానికే వారు “ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ,” అని ముద్దుగా చెప్పుకొంటారు. 

2014ఎన్నికలకు ముందు తెలంగాణా పిసిసి అధ్యక్షుడుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను ఆ కుర్చీలో నుంచి దింపేసేవరకు కాంగ్రెస్ నేతలు నిద్రపోలేదు. ఆ ప్రయత్నంలో వారు ఎన్నికలను కూడా పట్టించుకోలేదు. అందుకే కాంగ్రెస్ ఓడిపోయింది. అయినా వారు పెద్దగా బాధపడినట్లు కనబడరు. అందుకే మళ్ళీ ఇప్పుడు కొందరు ఉత్తం కుమార్ రెడ్డి వెంటపడుతున్నారు. ఆయనను ఆ కుర్చీలో నుంచి దింపేసి తమను దానిలో కూర్చోనివ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు బహిరంగంగానే కోరుతున్నారు. నిజానికి ఆ కుర్చీలో కోమటిరెడ్డి కూర్చొన్నా ఆయనకీ ఈ బాధలు తప్పవని చెప్పవచ్చు. 

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేయడం మాని అందరూ పిసిసి అధ్యక్ష కుర్చీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండటం చూసి కాంగ్రెస్ అధిష్టానం కూడా మేల్కొన్నట్లుంది. వెంటనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియాను హైదరాబాద్ కు పంపించింది.

ఆయన అధ్యక్షతన నిన్న హైదరాబాద్ లో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కల పని తీరు పట్ల కాంగ్రెస్ అధిష్టానం చాలా సంతృప్తిగా ఉందని, వారిరువురి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటుందని రామచంద్ర కుంతియా విస్పష్టంగా ప్రకటించారు. వారిరువు నాయకత్వం గురించి ఎవరు ప్రశ్నించినా క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే అవుతుంది కనుక ఇది కోమటిరెడ్డిని ఉద్దేశ్యించి చేసిన హెచ్చరికగానే భావించవచ్చు. మరి పిసిసి అధ్యక్ష పదవి కోసం కలలుకంటున్న కోమటిరెడ్డి ఏవిధంగా స్పందిస్తారో..తన కలను ఏవిధంగా సాకారం చేసుకొంటారో చూడాలి.


Related Post