అదీ తప్పే..ఇదీ తప్పే..

April 08, 2017


img

డిల్లీ సమీపంలో గల నోయిడాలో చదువుకొంటున్న కొందరు నైజీరియన్ విద్యార్ధులపై కొందరు స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అందుకు నైజీరియా ప్రభుత్వం భారత్ కు నిరసన తెలియజేయడం, భారత్ వివరణ ఇవ్వడం జరిగింది. భారత్ హామీతో ఈ వివాదం ముగిసిందనుకొంటే, వాటిని ఖండిస్తూ భాజపా మాజీ ఎంపి తరుణ్ విజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీయడం విశేషం. 

ఆయన ఒక విదేశీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “భారత్ లో జాతి, వర్ణ విద్వేషం ఎన్నడూ లేదు. మాదేశంలో కూడా దక్షిణాదికి చెందిన ఆంద్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల ప్రజలు నల్లగానే ఉంటారు. వారితో మేము కలిసే జీవిస్తుంటాము. వర్ణ వివక్ష పాటిస్తే వారితో ఉత్తరాదివారు కలిసి ఉండేవారు కాదు కదా?” అని అన్నారు. 

ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగడంతో ఆయన  క్షమాపణలు చెప్పారు. తన మనసులో భావాలను సరైన పదాలలో వివరించలేకపోవడం వలననే అది తప్పుగా వినిపించిందని, తన మాటలు ఎవరినైనా భాదిస్తే క్షమించాలని కోరారు. 

ఆయన ఏ పదాలను ఉపయోగించినప్పటికీ ఆయన మాటలు దక్షిణాది ప్రజల పట్ల ఉత్తరాదివారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో బయటపెట్టినట్లయింది. ఆయనకు దక్షిణాదిన తెలంగాణా అనే ఒక రాష్ట్రం ఏర్పడినట్లు కూడా తెలియదని అర్ధం అయింది. ఆ మాటకొస్తే ఆయనకే కాదు..ఉత్తరాది ప్రజలలో చాల మందికి దక్షిణాది రాష్ట్రాల పేర్లు, అక్కడ ఏ బాషలున్నాయనే సంగతి కూడా తెలియదు. నేటికీ “దక్షిణాది వారంటే మద్రాసీలే..డబ్బాలో రాళ్ళు వేసి కదిపితే వచ్చే శబ్దాల వంటి బాష వారిది” అనే నిశ్చితాభిప్రాయం చాల మందిలో ఉంది. ఎవరి అభిప్రాయలు వారికి ఉంటాయి కనుక అందుకు ఎవరినీ నిందించలేము.

దీనిపై పవన్ కళ్యాణ్ స్పందన కూడా అనుచితంగానే ఉందని చెప్పవచ్చు. ఆయన “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా” అనే చిత్రపటాన్ని పెట్టి “దక్షిణాది నల్లవారు కట్టే పన్నులు మీకు కావాలి కానీ వారంటే మీకు అసహ్యమా? మా దగ్గర నుంచి పన్నుల రూపేణా ఎంత తీసుకొన్నారు? తిరిగి ఎంత ఇచ్చారు? దక్షిణాది రాష్ట్రాలకు మీరు చేసింది ఏమిటి?” అంటూ ఆగ్రహంగా మెసేజ్ పెట్టారు.

భాజపా ఎంపి ఆవిధంగా మాట్లాడటం తప్పే. దానిని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా” అనే చిత్రపటాన్ని పెట్టడం కూడా తప్పే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రసంగించినా “దేశ సమగ్రత దెబ్బ తింటుంది. దానిని కాపాడాలి” అని చెప్పడం మరిచిపోరు. కానీ ఒక ఎంపి అనుచితంగా మాట్లాడితే దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా అటువంటి చిత్ర పటాన్ని పెట్టడం, ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రశ్నలు కురిపించడం కూడా తప్పేనని చెప్పక తప్పదు. 

ఎవరు ఔనన్నా కాదన్నా ప్రతీ దేశంలో ఇటువంటి రకరకాల వివక్షలు, ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. వాటిని ఏవిధంగా అధిగమించి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆలోచించాలి కానీ ఈవిధంగా కాదు. భారతీయులలో ఇంకా ఆ సహనశీలత చాలా ఉన్నందునే భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారనే వాస్తవాన్ని ఎవరూ మరిచిపోకూడదు.


Related Post