మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ మరోవైపు అదనపు ఆదాయం కోసం కపిల్ శర్మ టీవీ షోలో పాల్గొనడాన్ని సవాలు చేస్తూ పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు సిద్దూని తప్పు పట్టింది. ప్రతీ విషయాన్నీ చట్టం కోణంలో నుంచి మాత్రమే చూస్తూ తనను తాను సమర్ధించుకోవడం సరికాదని, భాద్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నప్పుడు నైతిక విలువలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించింది.
సిద్దూ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే టీవీ షోలో పాల్గొనవద్దని చాలా మంది సూచించారు. కానీ టీవీ షో ద్వారా వస్తున్న బారీ ఆదాయాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని సిద్దూ, తనకు వేరే అదాయమార్గాలేవీ లేవని తన కుటుంబం దానిపైనే ఆధారపడి నడుస్తోందని సమర్దించుకొని యధాప్రకారం టీవీ షోలలో పాల్గొంటున్నారు. ఇప్పుడు హైకోర్టు గడ్డి పెట్టింది కనుక ఇకనైనా ఆ కార్యక్రమంలో పాల్గొనడం మానుకొంటారో లేదో చూడాలి.
అయితే దేశంలో దాదాపు ప్రజా ప్రతినిధులు అందరూ ఏదో ఒక సైడ్ బిజినెస్ లేదా కాంట్రాక్టులు చేసుకొంటున్నారు. కొందరైతే తమ పదవులను, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని కూడా వాడేసుకొంటూ రెండు చేతులా కాంట్రాక్టులు, డబ్బు సంపాదించుకొంటున్నారు. ఈ పరిస్థితి తెలంగాణాలో కంటే ఆంధ్రాలో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ చిరకాలంగా రకరకాల వ్యాపారాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, కాంట్రాక్టులు వంటివి చేస్తున్నవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు.
సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి హెరిటేజ్ పాల వ్యాపారం, మంత్రి నారాయణకు నారాయణ విద్యాసంస్థలు, మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రత్యూష మొదలైన సంస్థలు, ఎంపిలు కేశినేని, దివాకర్ రెడ్డి లకు ట్రావెల్ బిజినెస్, తెదేపా ఎంపి రాయపాటి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు, ఎమ్మెల్యేలకు ఇసుక కాంట్రాక్టులు...ఇలాగ అందరికీ ఏదో ఒక సైడ్ బిజినెస్ లు ఉన్నాయి. అయితే వారందరూ సిద్దూ లాగ నేరుగా వాటిని నిర్వహించకుండా జాగ్రత్త పడుతున్నందున, ఎవరూ వారిని వేలెత్తి చూపలేకపోతున్నారు. సిద్దూ నేరుగా టీవీలో కనబడిపోతున్నాడు కనుక అడ్డంగా దొరికిపోయాడు అంతే!