నాస్తికులు హేతువాదులమని చెప్పుకొనే వామపక్ష నేతలు ఏదో ఒకరోజు గుళ్ళూ గోపురాల చుట్టూ తిరగడం, కుహానా ప్రజాస్వామ్యవిధానాన్ని వ్యతిరేకిస్తూ ఏళ్లతరబడి సాయుధపోరాటాలు చేసిన మావోయిస్టులు ఏదో ఒకరోజున జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసులకు లొంగిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే అంతవరకు తాము అనుసరించిన మార్గం, చాలా గొప్పవని నమ్మిన సిద్దాంతాలు, వాటికోసం తాము చేసిన పోరాటాలు అన్నీ తప్పేనని వారు అంగీకరించినట్లు భావించవలసి ఉంటుంది. కానీ అంతకాలం వారి వలన ప్రజలు, ప్రభుత్వాలకు మనశాంతి ఉండదు. వేలకోట్ల ప్రభుత్వాస్తులు వారి ఆశయాలకు ఆహుతి అవుతుంటాయి. చివరికి వారికి జ్ఞానోదయం అవుతుంది కానీ వారి వలన సమాజానికి కలిగిన నష్టం ఎన్నటికీ పూడ్చలేరు కదా!
ప్రజాకవి, గాయకుడు గద్దర్ కూడా మావోయిస్టులతో బంధాలు తెంచుకొని ఇకనుంచి ప్రజాస్వామ్య విధానంలో పోరాడేందుకు సిద్దం అయ్యారు. అంటే ఇంత కాలం ఆయన నడిచిన దారి సరైనది కాదని స్వయంగా ఒప్పుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. ఇంతకాలం ఆయన ఎంచుకొన్న విధానం వలన వ్యక్తిగతంగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోగలిగారు తప్ప బడుగు బలహీనవర్గాలకు మేలు చేయలేకపోయారని చెప్పక తప్పదు. ఇక నుంచి వారిలో రాజకీయ చైతన్యం కల్పించి హక్కులు సాధించుకొనేందుకు కృషి చేస్తానని గద్దర్ చెప్పడమే అందుకు నిదర్శనం. అయితే సమాజంలో ఇప్పటికే అనేక మంది వ్యక్తులు, సంఘాలు వారిలో చైత్యనం కలిగించి వారి తరపున పోరాటాలు చేస్తున్నాయి. కనుక గద్దర్ కొత్తగా సాధించేది ఏమీ ఉండకపోవచ్చు.
ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, వాటి ధన,కుల,మత సమీకరణాల ప్రభావం ప్రజలపై చాలా బలంగా ఉన్నప్పుడు గద్దర్ కేవలం పాటలు పాడి ఏదో సాధించాలనుకోవడం అంటే భ్రమలో బ్రతకడమే అని చెప్పవచ్చు. కనుక ఆయన ఆశించిన ఫలితం కొంతైనా సాధించాలనుకొంటే ఆయన రాజకీయ పార్టీ స్థాపించుకొని ఎన్నికలలో పోటీ చేసి అధికారం దక్కించుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆయన ఇప్పుడు ఎంచుకొన్న ఈ కొత్త మార్గంలో ముందుకు సాగితే గాయకుడిగా ఇంకా మంచి గుర్తింపు పొందగలుగుతారు. అదీ తనకు వద్దనుకొంటే చివరికి కంఠశోషే మిగులుతుందని చెప్పకతప్పదు.