జియో తన వలలో తనే చిక్కుకొందా?

April 07, 2017


img

జియో పరిస్థితి ఎలా ఉంది అంటే.."పెళ్ళయితేనే పిచ్చి తగ్గుతుంది.. పిచ్చి తగ్గితేనే పెళ్ళి అవుతుంది" అన్నట్లుంది. జియో డాటా కోసం వేరే నెట్ వర్క్ లపై ఆధారపడనవసరం లేదు కానీ కాల్స్ కోసం ఇతర మొబైల్ నెట్ వర్క్ లపై ఆధారపడక తప్పడం లేదు. అది కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు అందిస్తున్న ఉచిత అపరిమిత ఆఫర్లు, నామమాత్రపు ధరలకే అపరిమిత సేవల వలన మిగిలిన నెట్ వర్క్ ఆపరేటర్లకు తీవ్ర నష్టం కలుగుతున్నందున అవి జియోకు సహాయనిరాకరణ చేస్తున్నాయి.

జియో కాల్స్ ను మిగిలిన నెట్ వర్క్ ఆపరేటర్లు స్వీకరించకపోవడం చేత తన వినియోగదారులు జారిపోకుండా కాపాడుకొనేందుకు జియో మళ్ళీ మళ్ళీ ఏదో ఒక కొత్త పేర్లతో నిరంతరంగా ఆఫర్లు కొనసాగించవలసి వస్తోంది. కానీ దాని వలన కూడా మళ్ళీ మిగిలిన నెట్ వర్క్ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక అవి జియోకు సహకరించడం లేదు.

కనుక జియో ఆఫర్లను ఆపితేగాని ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లు దానికి సహకరించరు. అలాగని ఇంతకాలం ఉచిత అపరమిత సేవలకు అలవాటు పడిన తన వినియోగదారుల నుంచి ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లతో సమానంగా చార్జీలు వసూలు చేసినట్లయితే వారు చేజారిపోయే ప్రమాదం ఉంది. కనుక పదేపదే ఆఫర్లు ప్రకటించవలసి వస్తోంది.

ఇంకా చక్కగా చెప్పాలంటే జియో ప్రస్తుత పరిస్థితిని మన స్టార్ హీరోల పరిస్థితితో పోల్చవచ్చు. వారు కూడా మొదట్లో ప్రజలను...ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొని ఇండస్ట్రీలో స్థిరపడేందుకు కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ తమకు ఒక ఇమేజ్ సృష్టించుకొంటారు. ఆ తరువాత వారు పైకి ఎదిగిన తరువాత ఎంత ప్రయత్నించినా ఆ ఇమేజ్ చక్రబంధంలో నుంచి బయటపడలేరు. ఆ కారణంగా కమర్షియల్ చిత్రాలకే పరిమితమయ్యి రేసులో వెనుకబడిపోతుంటారు.

జియో విషయంలో కూడా ప్రస్తుతం ఇలాగే జరుగుతున్నట్లుంది. ఇదంతా చూస్తుంటే జియో ప్రజలను ఆకర్షించడానికి, తన ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికి విసిరిన వలలో చివరికి తనే చిక్కుకొన్నట్లు కనిపిస్తోంది. దీని నుంచి అది ఏవిధంగా బయటపడి నిలద్రొక్కుకొంటుందో చూడాలి. 


Related Post