తెరాస సర్కార్ కు ఓపెన్ సవాల్

April 07, 2017


img

తెరాస సర్కార్ కు త్వరలోనే వరుసగా మూడు సవాళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది. 1. ధర్నాచౌక్ 2.ఓపెన్ కాస్ట్ మైనింగ్ 3.సింగరేణి కార్మికుల సమ్మె.

వీటిలో ధర్నా చౌక్ సమస్యను అది చేజేతులా ఆహ్వానించుకొన్నదే కనుక అందుకు అది సిద్దపడకతప్పదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, టిజెఎసి, ఇంకా అనేకమంది మేధావులు ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దాని కోసం ‘ధర్నా చౌక్ పరిరక్షణ సమితి’ని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో యుద్దానికి సిద్దం అవుతున్నారు. హైదరాబాద్ లోని మక్దూం భవన్ లో నిన్న వామపక్ష నేతలు, వివిద ప్రజా సంఘాల నేతలు సమావేశమయ్యి ఈ సమస్యపై చర్చించారు. తెరాస సర్కార్ తక్షణం తన నిర్ణయన్ని వెనక్కు తీసుకోకపోతే వచ్చే నెల 10వ తేదీన 10,000 మందితో కలిసి ధర్నా చౌక్ ను ఆక్రమించుకొంటామని గట్టిగా హెచ్చరించారు. దీని కోసం వారు జిల్లాలు వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. 

ఇక మరో సమస్య ఓపెన్ కాస్ట్ మైనింగ్. దీనిని వ్యతిరేకిస్తూ భాజపా పోరాడటానికి సిఇడం అవుతోంది. ఈ పోరాటంలో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పాలుపంచుకోబోతున్నాయి. దీని కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ నిన్న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సమావేశం నిర్వహించింది. దానికి తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, కాంగ్రెస్, భాజపా, వామపక్షాల నేతలు హాజరయ్యారు. ఒకప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ వలన తెలంగాణా రాష్ట్రం బొందలగడ్డగా మారుతుందని వాదించిన కేసీఆర్, ఇప్పుడు ఉత్తర తెలంగాణాలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను ప్రోత్సహిస్తూ ఆ ప్రాంతాలను బొందలగడ్డలుగా మారుస్తున్నారని వారు విమర్శించారు. కనుక పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనీ నిర్ణయించుకొన్నారు. 

 ఇక సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పనతో బాటు మరి కొన్ని డిమాండ్ల సాధన కొరకు ఈనెల 17న సమ్మెకు వారు సిద్దం అవుతున్నారు. సింగరేణిలో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేయగా వారి సమ్మెకు మద్దతు పలకాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిర్ణయించాయి. కనుక తెరాస సర్కార్ త్వరలో ఈ మూడు సవాళ్ళను ఎదుర్కోక తప్పదు.  


Related Post