అమిత్ షా ఎందుకు రాలేదంటే...

April 07, 2017


img

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న సాయంత్రం హైదరాబాద్ రావలసి ఉంది కానీ ఆఖరు నిమిషంలో అయన పర్యటన రద్దయింది. నిన్న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం ఉన్నందునే అయన రాలేకపోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు చెప్పారు. ఆయన తెలంగాణా పర్యటన వాయిదా పడిందే తప్ప పూర్తిగా రద్దు చేసుకోలేదని చెప్పారు. త్వరలోనే ఆయన పర్యటన ఖరారు చేసి ప్రకటిస్తామని చెప్పారు.

అమిత్ షా లేదా రాహుల్ గాంధీ లేదా వామపక్షాల అధినేతలు కావచ్చు అందరికీ ఉత్తరాది రాష్ట్రాలపై ఉన్న శ్రద్ధ దక్షిణాది రాష్ట్రాల మీద లేదని చెప్పకతప్పదు. అందుకే వారు ఎప్పుడూ డిల్లీలోనే తిష్టవేసుకొని ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. వాటికే జాతీయస్థాయి రాజకీయాలనే ముద్దు పేరుపెట్టుకొన్నారు. 

ఒకవేళ తెలంగాణాలో భాజపాకు విజయావకాశాలు చాలా ఉన్నాయని అమిత్ షా నిజంగానే మనస్పూర్తిగా నమ్ముతున్నట్లయితే ఆయన తన పర్యటనను వాయిదా వేసుకొని ఉండేవారు కాదు. అందుకే తెలంగాణా భాజపాకు కూడా అంత ప్రాధాన్యం ఇవ్వడంలేదని చెప్పవచ్చు. 

దక్షిణాది రాష్ట్రాలలో ప్రధానంగా బాష, కులసమీకరణాలు, ప్రాంతీయ పార్టీల నుంచి ఎదురవుతున్న సవాళ్ళు వారికి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ వారి దృష్టిలో రెండవ ప్రాధాన్యతగానే ఉంటున్నాయి. అందుకే వారు ఎక్కువగా డిల్లీకే పరిమితం అయిపోతుంటారు. కనుక వాటి ఆ బలహీనతలే ప్రాంతీయ పార్టీలకు శ్రీరామరక్ష అని చెప్పవచ్చు.   

మీడియాలో కూడా ఈ వెర్రిపోకడ చాలా బలంగా ఉంది. డిల్లీ మరియు ఉత్తరాది రాష్ట్రాలలో సమస్యలు, అక్కడి రాజకీయ పరిణామాల గురించి వార్తలు, విశ్లేషణలు ప్రసారం చేయడానికే అవి పరిమితం అవుతాయి. వాటినే మనం జాతీయమీడియా అని చెప్పుకొంటున్నాము. దక్షిణాది రాష్ట్రాల నేతలు డిల్లీ వెళ్ళినప్పుడు జాతీయమీడియాతో మాట్లాడమని గొప్పగా చెప్పుకొంటారు.


Related Post