తెలంగాణాలో తెదేపా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని చెప్పక తప్పదు. కానీ ఎల్ రమణ, రేవంత్ రెడ్డి వంటి కొందరు సీనియర్ నేతలు ఇంకా ఆ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అయితే పార్టీలో అసలు బలం లేనప్పుడు వారు తెరాస సర్కార్ తో ఎంత గట్టిగా పోరాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
వచ్చే ఎన్నికలలో తెదేపాదే విజయం ఖాయం అని ఆత్మవంచన చేసుకొంటున్న తెదేపా నేతలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే, పోటీ చేసేందుకు పార్టీలో బలమైన అభ్యర్ధులున్నారా? ఉంటే ఎంత మంది ఉన్నారు? అని ప్రశ్నించుకొంటే పార్టీ వాస్తవ పరిస్థితి అర్ధం అవుతుంది. పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి తెరాస సర్కార్ తో అంతగా గట్టిగా ఎందుకు పోరాడుతున్నారు? దాని వలన ఆయన ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనే సందేహం కలుగుతుంది.
దానికి ఆయన చెప్పే సమాధానం తెరాస సర్కార్ నిరంకుశ, అప్రజాస్వామిక పాలన పట్ల ప్రజలలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని, అది మున్ముందు తెదేపాకు అనుకూలంగా మారవచ్చని వాదిస్తున్నారు. ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో తెదేపా కొంచెం బలహీనపడినప్పటికీ పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదని చెపుతున్నారు. అదే తమ పార్టీకి అసలైన బలమని చెపుతున్నారు. కానీ తెదేపా వాస్తవపరిస్థితి ఆయన చెపుతున్నట్లు లేదని అందరికీ తెలుసు. ఒకవేళ ఆయన తెరాసను డ్డీ కొనేందుకు సిద్దమయినా రెండు ప్రధాన అవరోధాలను అధిగమించడం కష్టం. ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసు మరకను ఎన్నటికీ చెరుపుకోలేరు. ఇక తెరాస లేవనెత్తే తెలంగాణా సెంటిమెంటుకు తెదేపా వద్ద సమాధానమే లేదు.
కనుక రేవంత్ రెడ్డితో సహా తెదేపా నేతల ముందున్న ఏకైక మార్గం పార్టీ మారడమే. తెరాసలో ఉన్నతస్థాయి నేతలందరూ తెదేపా నుంచి వెళ్ళినవారే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంతగా విమర్శిస్తున్న కారణంగా రేవంత్ రెడ్డి తెరాసలోకి వెళ్ళలేరు. కనుక తెదేపాకు మిత్రపక్షమైన భాజపాలోకి లేదా రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీలోకి మారిపోవలసి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఈ ఊహాగానాలను కూడా గట్టిగా ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యమే ఉంటే ఇంతగా ఆలోచించవలసిన అవసరమే లేదని, తను ఎప్పటికీ తెదేపానే నమ్ముకొని ఉంటానని చెప్పారు. ఒకవేళ ఆయన నిజంగానే తెదేపానే నమ్ముకొని ఉంటే దానితోబాటే అయన కూడా మునిగే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. కనుక రేవంత్ రెడ్డి మనసులో ఏమి ఆలోచన ఉందనేది వచ్చే ఎన్నికలలోగా మెల్లగా బయటపడవచ్చు.