బాబ్రీ మశీదు కూల్చివేతపై అనేక ఏళ్ళపాటు పోలీసులు, సిబిఐ అధికారులు దర్యాప్తులు జరిపారు. అనేక కోర్టులలో కేసులు దాఖలయ్యాయి. అనేక సం.లపాటు విచారణ కూడా జరిగింది. కానీ దోషులు ఎవరో అందరికీ తెలిసి ఉన్నా ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. చట్టప్రకారం శిక్షించబడలేదు. కారణం అందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఆ కేసును సాంకేతిక కారణాలతో పక్కనపెట్టేసింది. భాజపాను తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ హయంలోనే ఆ కేసులు ముందుకు సాగలేకపోతే , ఇప్పుడు భాజపా అధికారంలో ఉన్నప్పుడు సాగుతాయని ఎవరూ ఆశించరు...ఊహించలేరు కూడా. కానీ ఊహించనిదే జరుగుతోంది.
ఆ కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టినప్పుడు, సిబిఐ తరపు న్యాయవాది ఆ కేసులలో ప్రధాన నిందితులైన సీనియర్ భాజపా నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులపై కేసులు పునరుద్దరించాలని కోరడం విశేషం. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక వందల మంది సాక్షులను విచారించమని, ఇంకా మరి కొందరిని విచారించవలసి ఉందని వాదించారు. కనుక అద్వానీ, జోషి తదితరులపై కేసుల పునర్విచారణ చేపట్టాలని వాదించారు.
త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియబోతున్నందున, ఆయన స్థానంలో లాల్ కృష్ణ అద్వానీని రాష్ట్రపతిగా ఎంపిక చేసి, ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ గురువు రుణం తీర్చుకోవాలనుకొంటున్నారని ఆ మద్యన వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండటం విశేషం. ఈ కేసు మరికొంత కాలం సాగినట్లయితే లాల్ కృష్ణ అద్వానీని రాష్ట్రపతి చేయాలని ఎవరూ డిమాండ్ చేయలేరు. పైగా కేసును తిరగదోడినట్లయితే ఆయన రాష్ట్రపతి అవడం సంగతి దేవుడికి ఎరుక జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురవవచ్చు. సిబిఐ లేదా ఈడి లేదా మరో దర్యాప్తు సంస్థ ఏదైనా కేంద్రప్రభుత్వం కనుసన్నలలోనే పనిచేస్తుంది. దాని అనుమతి లేనిదే ఏదీ జరుగదు. కనుక ఈ సంగతి ప్రధాని నరేంద్ర మోడీకి తెలియదనుకోలేము. మరి సిబిఐ ఆవిధంగా కోరేందుకు ఎందుకు అనుమతించారు? ఇంతకీ లాల్ కృష్ణ అద్వానీని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతిని చేస్తారా లేక జైలుకి పంపించబోతున్నారా? ఏమో!