అమిత్ షా మళ్ళీ వస్తున్నారు..ఫలితం ఉంటుందా?

April 06, 2017


img

నేడు భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర భాజపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. నగరానికి చేరుకాగానే మొదట భాజపా రాష్ట్ర నేతలతో సమావేశం అవుతారు. శుక్రవారం ఉదయం పాతబస్తీలోని ఓంకార్ బస్తీలో సామాన్య ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. రేపు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని బూత్ స్థాయి భాజపా కార్యకర్తలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆయన తిరుగు ప్రయాణం ఇంకా ఖరారు కాలేదు. 

రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయ రాజకీయపార్టీగా ఎదిగే అవకాశం ఉందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. ముందుగా తమ పార్టీకి గట్టి పట్టున్న హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసుకొని, వచ్చే ఎన్నికలలో హైదరాబాద్ లోక్ సభ స్థానంతో సహా రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలని అమిత్ షా కలలు కంటున్నారు. అందుకే రేపు హైదరాబాద్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని బూత్ స్థాయి భాజపా కార్యకర్తలతో అయన సమావేశం కాబోతున్నారు. 

ఓడిశాలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా ఉన్న సావధాన్ సింగ్ ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాజపాకు విజయం సాధించిపెట్టినందున, అయనకే తెలంగాణా బాధ్యతలు కూడా అప్పగించారు. కనుక ఆయన సూచన మేరకు మొదట లోక్ సభ స్థానాలపై భాజపా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా అమిత్ షా తెలంగాణాలో రెండు మూడు సార్లు పర్యటించి బహిరంగ సభలు నిర్వహించినా రాష్ట్ర భాజపా పరిస్థితి ఇంకా దిగజారిపోయిందే తప్ప మెరుగుపడలేదు. యుద్దానికి బయలుదేరినప్పుడు సైన్యాధ్యక్షుడు ఒక్కడికే ఉత్సాహం ఉంటే సరిపోదు. వెనుకనున్న సైన్యానికి అంతే ఉత్సాహం ఉన్నప్పుడే విజయం సాదించగలదు. రాష్ట్ర భాజపాలో అదే లోపించింది. కనుకనే తనకు గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో ఓడిపోతూనే ఉంది. కనుక ఏదో అద్భుతం జరిగితే తప్ప అమిత్ షా పర్యటనతో ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.


Related Post