నిన్న విమర్శలు..నేడు వినతి పత్రాలు..ఇదీ వైకాపా తీరు. తెదేపాలో చేరి నేటికీ వైకాపా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారి చేత గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించినందుకు, వైకాపా నేతలు నిన్న ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నరే దానిని ఉల్లంఘించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి, వారి చేత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించకుండానే మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మరికొందరు ముఖ్య నేతలు కలిసి సోమవారం అదే గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు తెదేపా ప్రభుత్వంలో మంత్రులుగా భాద్యతలు చేపట్టడం రాజ్యాంగ విరుద్దమని కనుక వారిపై చర్యలు తీసుకోవలసిందిగా కోరారు
వారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వబోతున్నారని తెలిసిన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలిసి తమ అభ్యంతరం చెప్పి ఉండి ఉంటే ఆయన కూడా కొంచెం ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడేది. కానీ వారిచేత ఆయనే స్వయంగా ప్రమాణస్వీకారం చేయించిన తరువాత ఆయనకే వైకాపా వినతి పత్రం ఇచ్చిరావడం హాస్యాస్పదంగా ఉంది. ఈ ఆంధ్రా వ్యవహారంతో అసలు సంబంధంలేని వి హనుమంతరావు మొన్న రాజ్ భవన్ ముందు నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. కానీ అప్పుడు కూడా జగన్ కు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నా ఏమి ప్రయోజనం?
వైకాపా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావులకు మంత్రిపదవులు దక్కాయి.