కాంగ్రెస్, తెదేపాలు తరచూ చేసే పిర్యాదులలో తెలంగాణా ప్రాజెక్టు పనులలో ఎక్కువ శాతం ఆంధ్రా కాంట్రాక్టర్లకే తెరాస సర్కార్ అప్పగిస్తోందనేది కూడా ఒకటి. దానిపై మంత్రి హరీష్ రావు వివరణ ఇస్తూ, “వివిధ ప్రాజెక్టు పనులను ఈ ప్రోక్యూర్ మెంట్ విధానం ద్వారానే పనులు అప్పగిస్తుంటాము. తద్వారా మొదటి నుంచే పనులలో పార్శకత ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకొంటున్నాము. అయినా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోక తప్పడం లేదు.
సాధారణంగా తక్కువ ధరకు నాణ్యతతో పనిచేయడానికి ముందుకు వచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కుతుంటాయనే సంగతి తెలిసిందే. ఈ ప్రోక్యూర్ మెంట్ విధానంలో కూడా అందుకు అనుగుణంగానే షరతులు నిర్దేశించబడ్డాయి. నిర్మాణ రంగంలో ఆరితేరిన ఆంధ్రా కాంట్రాక్టర్లు మన తెలంగాణాలోనే కాదు..మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశవిదేశాలలో కూడా పనులు దక్కించుకొని చేస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణాలో వారితో పోటీ పడి తక్కువ ధరలకు పనులు చేయగల కంపెనీలు లేవనే చెప్పవచ్చు. అది మన తప్పు కాదు. ఆంధ్రా కాంట్రాక్టర్లు ఈ రంగంలో మనకంటే చాలా ముందున్నారు. అందుకే వారు దేశవిదేశాలలో కూడా పనులు దక్కించుకొని చేయగలుగుతున్నారు. తెలంగాణాలో కూడా అదే జరుగుతోంది.
ఇలాగ మన రాష్ట్రంలో పనులు దక్కించుకొన్నవారిలో ఇతర పార్టీల వారే ఎక్కువ ఉన్నారు. ఈ కారణంగా మా తెరాసకు చెందినవారికి కూడా పనులు దక్కడం లేదు. అందుకు మావాళ్ళలో కొంత అసంతృప్తి కూడా ఉందని మాకు తెలుసు. దానికి మేము కూడా బాధపడుతున్నాము. కానీ తక్కువ ఖర్చుతో వేగంగా పనులను పూర్తిచేయాలనే ఉద్దేశ్యంతో మేము మావాళ్ళని కూడా పక్కనపెడుతున్నాము. ఈ సంగతి ప్రతిపక్ష పార్టీలకు కూడా తెలుసు. కానీ వారు తమ రాజకీయ ప్రయోజానాల కోసం తెలియనట్లుగా మాట్లాడుతూ ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తుంటారు.
నిజం చెప్పాలంటే మేము అధికారంలోకి వచ్చిన తరువాత మోబిలైజేషన్ పేమెంట్లు, అడ్వాన్స్ పెమెంట్లు వంటి రకరకాల చెల్లింపులను నిలిపివేసి వ్యయాన్ని చాలా వరకు తగ్గించాము. మేము రూ.2,500 వేల కోట్లతో చేస్తున్న ప్రాజెక్టులో రూ.10,000 కోట్లు అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటం అర్ధరహితమే కదా? వాళ్ళు మామీద ఆరోపణలు చేసినప్పుడు ఒకటిరెండుసార్లు జవాబు చెపుతాము. శాసనసభ సమావేశాలలో లెక్కలతో సహా వాటిని వివరిస్తుంటాము. అయినా వారు ఆరోపణలు చేయడం మానుకోవడం లేదు. వారి ఆరోపణలకు జవాబులు చెపుతూ సమయం వృధా చేయడం కంటే, చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు ఫలితాలు చూపించడమే మంచిదని భావించి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకే సాగిపోతున్నాము,” అని జవాబిచ్చారు మంత్రి హరీష్ రావు.