కాశ్మీర్లో అభివృద్ధి సాధ్యమేనా?

April 03, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో జరిగిన బహిరంగ సభలో కాశ్మీర్ యువతకు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. వారు పర్యాటక రంగాన్ని ఎంచుకొని తమ జీవితాలలో వెలుగులు నింపుకొంటారో లేక వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ఎంచుకొని తమ జీవితాలను అంధకారంగా మార్చుకొంటారో తేల్చుకోవాలని కోరారు. 

గత 4దశాబ్ధాలుగా ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న పాక్ ప్రేరేపిత వేర్పాటువాదం వలన పర్యాటకరంగం దెబ్బతింది. దాని వలన లక్షలాది కాశ్మీరీల జీవితాలు చిద్రం అయ్యాయి. ఈ వేర్పాటువాదులను ఎదుర్కోవడానికే కేంద్రప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేయవలసివస్తోంది. అదే ఆ రాష్ట్రాభివృద్ధికి వినియోగించి ఉండి ఉంటే నేడు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మరొకలాగ ఉండేది. ప్రధాని మోడీ చెప్పినట్లు అప్పుడు కాశ్మీర్ ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రాంతంగా ఎదిగి ఉండేది. అప్పుడు ఆ రాష్ట్ర ప్రజల జీవితాలు కూడా అద్భుతంగా ఉండేవి.

ఒకప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలలోను రాజకీయాలే ఎక్కువగా కనబడేవి. కానీ గత కొన్నేళ్లుగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి మంత్రం పాటిస్తూ అభివృద్ధిలో పోటీలు పడుతున్నాయి. కానీ వేర్పాటువాదం కారణంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మాత్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. ఆ రాష్ట్రం పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిగి ఉంది. దానికి అదనంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంది. ఆ కారణంగా కేంద్రం నుంచి బారీగా నిధులు అందుతున్నాయి. అందమైన ప్రకృతికి ఆ రాష్ట్రం నిలయం. ఇక కాశ్మీర్ అందాలు, సరస్సులు, యాపిల్ పళ్ళు, పూల తోటలు, సుగంధ ద్రవ్యాల గురించి అందరికీ తెలిసిందే. దేశంలో మరే రాష్ట్రానికి లేనన్ని ప్రత్యేకతలు, వెసులుబాటులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలు, పాలకులు అందరూ కూడా అభివృద్ధి కంటే వేర్పాటువాదంవైపే మొగ్గుచూపినందున ఆ రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. నేటికీ వారి ఆలోచనలో మార్పు రాలేదు. సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ స్వయంగా వేర్పాటువాదులపట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నప్పుడు అభివృద్ధి ఏవిధంగా సాధ్యం?  

కనుక మోడీ చెప్పిన ఈ మంచి మాటలు కాశ్మీరీ యువత, నేతల చెవికి ఎక్కుతాయని అనుకోలేము. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ముందుగా అక్కడి వేర్పాటువాదులను ఎరిపారేయడమే. అప్పుడు గానీ వారి ఆలోచనలలో మార్పురాదు. అందుకు అక్కడ బలమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం, సమర్ధమైన దీర్గకాలిక ప్రణాళిక అవసరం. ఈ సంగతి పట్టించుకోకుండా ఎవరు ఎన్ని మంచిమాటలు చెప్పినా అవన్నీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అవుతాయి. 


Related Post